అట్రాసిటీ కేసుల్లో శిక్షలు అంతంతే!

15 Feb, 2016 01:07 IST|Sakshi
అట్రాసిటీ కేసుల్లో శిక్షలు అంతంతే!

♦ 2015లో 237 కేసుల పరిష్కారం
♦ 22 కేసుల్లో 36 మందికే శిక్షలు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలకు చెందిన వారిపై దాడులు, అత్యాచారాలకు సంబంధించి ఏటా కేసుల సంఖ్య పెరుగుతున్నా దోషులకు శిక్షలు పడుతున్నది మాత్రం నామమాత్రంగానే ఉంటోంది. ఎస్సీ, ఎస్టీల అట్రాసిటీ కేసులు, కోర్టుల్లో కేసుల పురోగతి తదితర అంశాలపై పార్లమెంటరీ కమిటీకి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక సమర్పించింది. అందులోని వివరాల ప్రకారం 2013లో మొత్తం 437 కేసులను కోర్టులు పరిష్కరించగా (నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 97), 23 కేసుల్లో 34 మందికి శిక్షలు పడ్డాయి. ఆ ఏడాది శిక్షల సరాసరి 5.26 శాతంగా నమోదైంది. అలాగే 2014లో మొత్తం 298 కేసులను కోర్టులు పరిష్కరించగా (ఆదిలాబాద్  జిల్లాలో అత్యధికంగా 83), 18 కేసుల్లో 35 మందికి శిక్షలు పడ్డాయి. ఆ ఏడాది శిక్షల సరాసరి 6.04 శాతంగా ఉంది.

2015 విషయానికొస్తే మొత్తం 237 కేసులను కోర్టు పరిష్కరించగా (నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 58), 22 కేసుల్లో 36 మందికి శిక్షలు పడ్డాయి. ఆ ఏడాది శిక్షల సరాసరి 9.28 శాతంగా ఉంది. 2015లో హైదరాబాద్-సిటీ, నిజామాబాద్ జిల్లా, వరంగల్-రూరల్, కరీంనగర్ జిల్లా, ఆర్‌పీ సికింద్రాబాద్, సీఐడీ-టీఎస్ హైదరాబాద్ పరిధిలో ఒక్క కేసును కూడా కోర్టులు పరిష్కరించలేదు. రాష్ట్రంలో 2015లో (డిసెంబర్ మొదటివారం వరకు) మొత్తం 1,668 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదవగా అందులో 468 కేసుల్లో మాత్రమే పోలీసుస్టేషన్లలో అభియోగాల నమోదు (కే సెస్ ఛార్జ్‌డ్) జరిగింది. వాటిలోనూ 285 కేసుల్లోనే తదుపరి విచారణ (కేసెస్ రిఫర్డ్)కు ఆస్కారం ఏర్పడింది. 2011-14 మధ్య చోటుచేసుకున్న కేసులు కూడా దాదాపుగా ఇదే కోవలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

మరిన్ని వార్తలు