24 నియోజకవర్గాలు చెల్లాచెదురు

1 Jul, 2016 02:24 IST|Sakshi
24 నియోజకవర్గాలు చెల్లాచెదురు

రెండు, మూడు జిల్లాలతో కలయిక
ఏడు నియోజకవర్గాలు మూడు జిల్లాల పరిధిలోకి..
17 నియోజకవర్గాలు రెండేసి జిల్లాల్లోకి..
సీఎం సహా ముగ్గురు మంత్రుల సెగ్మెంట్లపై ప్రభావం
జిల్లాల పునర్‌వ్యవస్థీకరణతో తలెత్తనున్న పరిస్థితి

 
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ రాజకీయ నేతలకు కలవరం పుట్టిస్తోంది. పునర్విభజన ప్రక్రియతో కొన్ని నియోజకవర్గాలు రెండు, మూడు జిల్లాల పరిధిలోకి వెళ్తున్నాయి. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇప్పుడున్న పది జిల్లాలను 24 జిల్లాలుగా విభజించే తాజా ముసాయిదా ప్రకారం... రాష్ట్రవ్యాప్తంగా 24 నియోజకవర్గాలు చెల్లాచెదురవుతున్నాయి. వీటిలో ఏడు నియోజకవర్గాలు ఏకంగా మూడు జిల్లాల్లో కలిసిపోతున్నాయి. దీంతో అక్కడి ఎమ్మెల్యేలు ట్రిపుల్ రోల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తనుంది. మిగతా 17 నియోజకవర్గాలు రెండేసి జిల్లాల్లో ఉంటాయి. దీంతో అక్కడి ఎమ్మెల్యేలు సైతం రెండు జిల్లాల్లో ద్విముఖ పాత్రాభినయం పోషించాల్సి ఉంటుంది.

స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం అటు మెదక్ జిల్లాలో, ఇటు సిద్దిపేట జిల్లాలోనూ చేరిపోనుంది. మంత్రులు ఈటల రాజేందర్,  జూపల్లి కృష్ణారావు, అజ్మీరా చందూలాల్‌ల నియోజకవర్గాలు పునర్విభజనతో రెండు జిల్లాలకు చెదిరిపోతాయి. నియోజకవర్గాల పరిధిని పట్టించుకోకుండా కొత్త జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేయటంతో ఈ పరిస్థితి తలెత్తింది.
 
రెండు జిల్లాల్లో ఉండే నియోజకవర్గాలివే..
ఆసిఫాబాద్, ఖానాపూర్, మంథని, మానకొండూరు, వేములవాడ, హుజురాబాద్, ములుగు, స్టేషన్ ఘన్‌పూర్, ఆందోల్, దుబ్బాక, గజ్వేల్, నారాయణఖేడ్, నర్సాపూర్, కొల్లాపూర్, కల్వకుర్తి, కొడంగల్, ఎల్లారెడ్డి
 
మూడు జిల్లాల్లో ఉండే నియోజకవర్గాలు..
చొప్పదండి, హుస్నాబాద్, పాలకుర్తి, జనగాం,  ఇల్లందు, తుంగతుర్తి, దేవరకొండ

మరిన్ని వార్తలు