తెలంగాణ భవన్‌ వద్ద భారీగా పోలీసుల మోహరింపు..

29 Nov, 2023 12:18 IST|Sakshi
దీక్ష దివస్‌ సందర్భంగా కేటీఆర్‌ రక్తదానం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. తెలంగాణ భవన్‌లో దీక్ష దివస్‌ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి ఎన్నికల కమిషన్‌ స్వ్కాడ్‌ టీమ్ చేరుకుని కార్యక్రమాలను నిలిపివేయాలని కోరింది. దీంతో, ఇది కొత్త కార్యక్రమం కాదని.. ఎప్పటి నుంచో జరుపుతున్నామని బీఆర్‌ఎస్‌ నేతలు తెలిపారు. అయితే, ఈ కార్యక్రమాన్ని భవన్‌ లోపలే జరుపుకోవాలని అధికారులు సూచించారు. దీంతో, కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. 

వివరాల ప్రకారం.. తెలంగాణ భవన్‌లో దీక్ష దివస్‌ కార్యక్రమం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా నవంబర్‌ 29వ తేదీన కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదం ఇచ్చారు. అందుకే ఈరోజున దీక్ష దివస్‌ పేరుతో బీఆర్‌ఎస్‌ నేతలు కార్యక్రమం జరుపుతున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు తెలంగాణ భవన్‌లో కార్యక్రమం జరుగుతోంది. ఎన్నికల సందర్భంగా కార్యక్రమం జరపడంపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో వేడుకలు నిర్వహించరాదని సూచించింది. దీంతో, తెలంగాణ భవన్‌కు ఎన్నికల కమిషన్‌ స్వ్కాడ్‌ టీమ్‌ చేరుకుని.. కార్యక్రమాన్ని నిలిపివేయాలని సూచించింది. ఈ క్రమంలో ఇది కొత్త కార్యక్రమం కాదని.. ఎప్పటి నుంచో చేస్తున్నట్టు బీఆర్‌ఎస్‌ నేతలు, లీగల్‌ టీమ్‌  సూచించారు. అనంతరం, డీసీపీతో కూడా వారు మాట్లాడారు. 

దీంతో, ఈ కార్యక్రమాన్ని బహిరంగంగా కాకుండా తెలంగాణ భవన్‌ లోపల నిర్వహించుకోవాలని వారికి పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో భవన్‌ లోపలే కార్యక్రమం చేస్తున్న బీఆర్‌ఎస్‌ నేతలు. ఇక, కమిషన్‌ సూచనల మేరకు తెలంగాణ భవన్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించినట్టు సమాచారం. ఇక, వేడుకల కోసం కేటీఆర్‌ కాసేపట్లో తెలంగాణ భవన్‌కు వెళ్లనున్నారు. మరోవైపు.. దీక్ష దివస్‌ సందర్భంగా కేటీఆర్‌ రక్తదానం చేశారు. 

మరిన్ని వార్తలు