దేవుడికి ఎవరన్నా మట్టి లడ్డూ పెడతారా..!

26 Aug, 2014 10:25 IST|Sakshi
దేవుడికి ఎవరన్నా మట్టి లడ్డూ పెడతారా..!

దేశ వ్యాప్తంగా మహా గణపతిగా పేరుగాంచిన ఖైరతాబాద్ గణపతి చేతిలో పెట్టే లడ్డూ ప్రసాదం తయారీ ఎంతో ప్రత్యేకమే కాదు.. పవిత్రం కూడా. ఈ లడ్డూ తయారీకి ఓ చిన్నారి కారణం కావడం విశేషం. ఈ మహా ప్రసాదాన్ని సమర్పించడం 2010 నుంచే ప్రారంభమైంది. అంతకు ముందు గణనాథుడి చేతిలో కృత్రిమంగా చేసిన ప్రసాదం ఉండేది. అయితే, తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత పి.వి.వి.ఎస్.మల్లికార్జురావు (మల్లిబాబు) 2009లో కుటుంబ సమేతంగా ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు వచ్చారు. అప్పుడు ఆయన మూడేళ్ల కూతురు మనస్వి దేవుడి చేతిలో మట్టి లడ్డూను చూసి ‘దేవుడికి ఎవరన్నా మట్టి లడ్డూ పెడతారా..!’ అని ప్రశ్నించింది.

ఇది మల్లిబాబులో బలంగా ముద్రపడింది. దీంతో దేవుడికి నిజమైన లడ్డూనే ప్రసాదంగా సమర్పించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్, శిల్పి రాజేంద్రన్‌ను కలిసి తన ఆలోచనను వివరించారు. వారి అనుమతితో మరుసటి ఏడు 2010లో 600 కిలోల లడ్డూను ప్రసాదంగా సమర్పించారు. అదే విధంగా 2011లో 2400 కిలోలు, 2012లో 3500 కిలోలు, 2013లో 4200 కిలోల లడ్డూను మహా గణనాథుడికి ప్రసాదంగా సమర్పించారు. ఇదే ఆనవాయితీని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది 5000 కిలోలు (ఐదు టన్నులు) లడ్డూను సమర్పించనున్నారు. ఈ ప్రసాదం తయారీని ఓ బృందం ఎంతో పవిత్రంగా చేపడతారు. అది ఎలాగంటే..    

ప్రసాదం తయారీ ఇలా...

యేటా మహా గణపతికి లడ్డూను ప్రసాదం తయారీకి చవితికి పది రోజుల ముందు నుంచే పనులు చేపడతారు. ముహూర్తం చేసుకుని తాపేశ్వరంలోని సురిచి ఫుడ్స్ ఆవరణలో ప్రత్యేక కుటీరాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రసాదం తయారీలో పాల్గొనే సిబ్బందితో పాటు యజమాని మల్లిబాబు కూడా వినాయక మాల ధరించి.. మిఠాయితో విఘ్న నాయకుడి విగ్రహాన్ని తయారు చేసి మండపంలో ప్రతిష్టిస్తారు. అనంతరం పప్పు దినుసులను శుభ్రం చేసి పనులు చేపడతారు.

ఇలా ప్రతి సంవత్సరం చీఫ్ కుక్ మల్లి, బెంగాలీ కుక్ ఒప్పితో పాటు 11 మంది సిబ్బంది పాలు పంచుకుంటారు. వీరంతా చవితికి నాలుగు రోజుల ముందు పొయ్యి వెలిగించి తొలుత బూంది తయారు చేస్తారు. లడ్డూకు కావాల్సిన పంచదార, నెయ్యి, జీడిపప్పు, యాలకులు పచ్చ కర్పూరం సిద్ధం చేసి 9 కళాయిల్లో బూంది తీస్తుండగా.. మరో పక్క లడ్డూ చుట్టడం ప్రారంభిస్తారు. సహజ రంగులు, జీడిపప్పు పేస్టుతో లడ్డూపై వినాయకుడి ప్రతిమలను, ఇతర దేవతామూర్తులను రూపొందించి అలంకరిస్తారు. ఈ లడ్డూ సాధారణ వాతావరణంలో ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది.
 
ప్రాణమున్నంత వరకు సమర్పిస్తా..
 
తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం గ్రామంలో 1939లో మా నాన్న సత్తిరాజు కాజా తయారీ ప్రారంభించారు. దాన్ని వారసత్వంగా నేను సురుచి ఫుడ్స్ ద్వారా అందజేస్తున్నాను. నేను జీవించి ఉన్నంత కాలం మహా గణపతికి లడ్డూను సమర్పించుకుంటానని ఉత్సవ కమిటీకి మాటిచ్చాను. భగవంతుడికి, భక్తుడికి మధ్య ప్రాంతీయ బేధాలు ఉండవు. ఈ సంవత్సరం మహా లడ్డూను నవరాత్రుల తర్వాత భక్తులకు పంచాలని తీసుకున్న నిర్ణయం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది.
 - మల్లికార్జునరావు,  సురుచి ఫుడ్స్
 
 ఈ ఏడాది లడ్డూ కోసం వాడిన పదార్థాలు..
 
 శెనగపప్పు    1450 కిలోలు
 నెయ్యి         1000 కిలోలు
 పంచదార     2250 కిలోలు
 బాదం పప్పు    90 కిలోలు
 యాలకులు    30 కిలోలు
 పచ్చ కర్పూరం  10 కిలోలు
 
లడ్డూ తయారీ పనులు ఈ నెల 24న ప్రారంభించారు. ఈ లడ్డూ ఐదు టన్నుల బరువు, 6.5 అడుగుల వ్యాసం, 7.5 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనిని 28వ తేదీన ప్రత్యేక వాహనంలో నగరానికి తరలించి 29న వినాయక చవితికి మహా గణపతికి ప్రసాదంగా సమర్పిస్తారు.

మరిన్ని వార్తలు