కొత్త ఓటు.. తీర్పు ఎటు?

13 Feb, 2017 00:31 IST|Sakshi
కొత్త ఓటు.. తీర్పు ఎటు?

టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి కొత్తగా 6 వేలకుపైగా ఓట్లు

  • మద్దతు కోసం టీచర్ల సంఘాలతో ఆశావహుల సంప్రదింపులు
  • సిట్టింగ్‌ ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు టీఆర్‌ఎస్‌ యత్నాలు
  • ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో హరీశ్‌ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాలు బిజీ అయ్యాయి. ఇప్పటికే మద్దతు ప్రకటించిన తమ అభ్యర్థులతో సభలు, సమా వేశాల నిర్వహణలో పడ్డాయి. టీఆర్‌ఎస్‌ కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు దృష్టి సారించింది. గతంలో కంటే ఈసారి ఓట్ల సంఖ్య 6 వేలకు పైగా పెరగడంతో ఆశావహులు తమ ప్రయత్నాల్లో ముని గారు. ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రభుత్వ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చ రర్ల ఓట్లు ఈసారి కీలకం కానున్నాయి. దీంతో నోటి ఫికేషన్‌ జారీ కాకముందు నుంచే ఆయా సంఘాల సమావేశాల నిర్వహణలో ఆశావహులు తల మునకల య్యారు. ఈ నెల 13 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. తమ అభ్యర్థులను పోటీలో నిలుపుతామని  5 సంఘాలు ప్రకటించాయి.

అభ్యర్థులు ఎందరో...?
ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారికంగా 8 మంది అభ్యర్థులను పోటీలో నిలుపుతామని వివిధ ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. అందులో కొందరు నామినేషన్లు వేసినా చివరిలో ఉపసంహ రించుకునే అవకాశం ఉంది. ప్రధానంగా పోటీలో ఉండే అభ్యర్థులు సంఘాల మద్దతు కూడగట్టడంతో పాటు ఈ అంశంపైనా ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తానికి ప్రధాన పోటీ ఇద్దరి మ«ధ్యే ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం కూడా ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఆయన ఇదివరకే టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే పార్టీ అధికారికంగా తమ అభ్యర్థి అని ప్రకటించకపోయినా ఆయన్ను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నియోజకవర్గంలోని మూడు జిల్లాలకు చెందిన మంత్రులను అప్రమత్తం చేసింది.

ఇటీవలే మంత్రి హరీశ్‌రావు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమయ్యారు. శనివారం ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించారు. గతంలో జరిగిన గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దేవీప్రసాద్‌ ఓటమికి ప్రధాన కారణం ఉపాధ్యాయులేనన్న భావన ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో గత పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పెరిగిన ఓటర్లు
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2011లో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో 15,053 ఓట్లు ఉండగా అందులో 11,883 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య పెరిగింది. ఈ నెల 13 వరకు కూడా ఓటర్ల నమోదుకు అవకాశం ఉంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల నుంచి అధిక సంఖ్యలో ఓటర్లు నమోదయ్యారు. ఓటర్ల సంఖ్య 21,520కి చేరింది. ఈసారి పోలింగ్‌ శాతాన్ని పెంచుకునేందుకు ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సభలు, సమావే శాలు నిర్వహిస్తూ తమకు పడే ఓట్లపై బేరీజు వేసుకుంటున్నారు. పాత జిల్లాల ప్రకారం  మహ బూబ్‌నగర్‌లో 6,510 మంది, రంగారెడ్డి జిల్లాలో 12 వేల మంది, హైదరా బాద్‌ జిల్లాలో 3,010 మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

సంఘాల నుంచి ఎవరెవరు?
15 ఏళ్లు ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్‌గా పని చేసిన ఏవీఎన్‌ రెడ్డిని గెలిపించుకు నేందుకు ఎస్టీయూ, టీఎస్‌టీయూ, మరికొన్ని ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు తీవ్రంగా ప్రయత్నిస్తు న్నాయి. వివిధ ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల మద్దతు కూడగట్టుకోవడంతోపాటు ప్రైవేటు స్కూళ్లు కాలేజీల నుంచి భారీ మొత్తంలో ఓటర్ల నమోదుకు చర్యలు చేపట్టారు. ఇక పీఆర్‌టీయూ– తెలంగాణ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు హర్షవర్ధన్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టీచర్‌ పోస్టుకు రాజీనామా చేసి ఆయన పోటీకి సిద్ధమయ్యారు. పీఆర్‌టీయూ– టీఎస్‌పై వ్యతిరేకతే ప్రధాన అంశంగా ప్రచారం చేస్తున్నారు. టీఎస్‌–యూటీఎఫ్‌ అభ్యర్థిగా మాణిక్‌రెడ్డి, టీపీయూఎస్‌ అభ్యర్థి భూపతిరెడ్డి తమ ప్రచారాన్ని కొనసాగి స్తున్నారు. మరికొన్ని ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యర్థులు పోటీలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు.

మరిన్ని వార్తలు