ఎస్సీల అత్యవసర సాయానికి మరో నిధి

27 Apr, 2018 01:23 IST|Sakshi

రూ. 62 కోట్లతో సీడబ్ల్యూఎఫ్‌ ఏర్పాటుకు నిర్ణయం

ప్రస్తుతం అమల్లోలేని పథకాలు, ప్రత్యేక అవసరాలు పరిగణనలోకి

వ్యక్తిగత, కుటుంబ స్థాయిలో రూ. 5లక్షల ఆర్థిక సాయం  

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక ఇబ్బందులు, ప్రోత్సాహంకోసం ఎదురుచూసే ఎస్సీ యువతను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీ ఎస్‌డీఎఫ్‌) అమలు చేస్తున్నప్పటికీ వీటి పరిధిలోకి రాని అంశాలను క్రోడీకరిస్తూ కొత్తగా క్రూషియల్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ (సీడబ్ల్యూఎఫ్‌) అమల్లోకి తెచ్చింది.

ఈ నిధినుంచి అత్యవసర ఆర్థికసాయం కోసం వచ్చేవారికి నేరుగా నగదును అందించే వెసులుబాటు ఉంటుంది. 2018–19 వార్షిక సంవత్సరం నుంచి ఈ నిధి అందుబాటులోకి వచ్చింది. తాజా వార్షిక సంవత్సరంలో సీడబ్ల్యూఎఫ్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.62 కోట్లు కేటాయించింది.  

సాయమే పరమావధిగా...
ఎస్సీ ఎస్‌డీఎఫ్‌ ద్వారా 42 శాఖల ద్వారా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ నగదు సాయం పథకాలు పెద్దగా లేవు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కల్యాణలక్ష్మి లాంటి పథకాల్లో నగదును సాయం రూపంలో ఇచ్చినప్పటికీ నిబంధనలకు లోబడే పంపిణీ చేస్తారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ స్థాయి కార్యక్రమాల్లో పాల్గొనే వారికి ఆర్థికంగా ఇబ్బందులుంటే సీడబ్ల్యూఎఫ్‌ ద్వారా నేరుగా నగదు సాయాన్ని అందించే వీలుంది.

క్రీడల్లో పాల్గొనే వారు, సెమినార్లకు హాజరయ్యేవాళ్లు, ఉపాధి అవకాశాలకు సంబంధించి విదేశాల్లో ఈవెంట్లకు హాజరవ్వాలనుకున్న సందర్భంలో వారికి అత్యవసర సాయం కింద ఖర్చులు, ప్రయాణ చార్జీలను ఈ నిధి కింద ఇస్తారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించిన ఎస్సీ క్రీడాకారులకు కూడా నిర్ణీత మొత్తంలో నగదు పారితోషకాలను ఈ నిధి కింద ఇవ్వొచ్చు. అదేవిధంగా వ్యక్తిగత వృద్ధి, ఉపాధి మార్గాలకు సంబంధించిన అంశాలతో పాటు యంత్రాంగం విచక్షణతో సాయం చేసేలా ఈ నిధి నిబంధనలను ప్రభుత్వం రూపొందించింది.

కలెక్టర్లకు బాధ్యతలు...
సీడబ్ల్యూఎఫ్‌ కింద అర్హుల ఎంపిక, సాయం పంపిణీ బాధ్యతల్ని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. ఆర్థిక సాయంకోరే అభ్యర్థి ముందుగా సంబంధిత జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిని సంప్రదించి దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అనంతరం దాన్ని పరిశీలించిన అధికారి కలెక్టర్‌కు సిఫార్సు చేస్తారు. అక్కడ దరఖాస్తును పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం సీడబ్ల్యూఎఫ్‌ కింద సాయాన్ని మంజూరు చేస్తారు.

సాయం పరిమితి రూ.5 లక్షలవరకు కలెక్టర్‌ నిర్ణయం ఆధారంగా మంజూరవుతుంది. అంతకుమించి సాయం ఆశిస్తే ఫైలును ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి తర్వాతే రూ.5లక్షలకు మించిన సాయం ఇస్తామని ఆ శాఖ సంచాలకులు పి.కరుణాకర్‌ ‘సాక్షి’తో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు