‘వెన్ను’లో వణుకు!

16 Oct, 2015 00:55 IST|Sakshi
‘వెన్ను’లో వణుకు!

నగరంలో పెరుగుతున్న  వెన్ను నొప్పి బాధితులు
అత్యధికులు 30-40 ఏళ్లలోపు వారే
నేడు వరల్డ్ స్పైన్ డే

 
సిటీబ్యూరో: గ్రేటర్‌లోని యువతను వెన్ను, మెడ, నడుం నొప్పి వంటివి వేధిస్తున్నాయి. పాతికేళ్లకే నగర వాసులు ఈ నొప్పుల బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అదేపనిగా వాహనాలపై ప్రయాణించడం... గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కదలకుండా కూర్చోవడం వల్ల చిన్న వయసు (30-40 ఏళ్లు)లోనే మెడ, నడుం, వెన్నెముక నొప్పుల భారిన పడుతున్నారు. బాధితుల్లో 65-70 శాతం మంది ద్విచక్ర వాహనదారులే. ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారు.. మార్కెటింగ్ రంగంలోని వారే ఎక్కువ ఉన్నట్లు వెల్లడైంది. 2002-2007 మధ్య కాలంలో జంట నగరాల్లో ఐదు వేల వెన్నెముక శస్త్ర చికిత్సలు జరగ్గా... 2012-13లో ఈ సంఖ్య పది వేలు. తాజాగా ఇవి నెలకు సగటున వెయ్యికి చేరుకున్నట్లు సన్‌షైన్ ఆస్పత్రికి చెందిన స్పైన్ సర్జన్ డాక్టర్ జీపీవీ సుబ్బయ్య స్పష్టం చేశారు.

ఓ వైపు మెట్రో పనులు.. మరో వైపు గుంతలు
 చిన్నపాటి వర్షానికే గ్రేటర్ రహదారులు తీవ్రంగా దెబ్బ తింటున్నాయి. రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. దీనికి తోడు మెట్రో పనుల కోసం రోడ్లను తవ్వేస్తున్నారు. వాహనదారులంతా గుంతల రోడ్లపై ప్రయాణించాల్సి వస్తోంది. ఫలితంగా ద్విచక్ర వాహనదారులు, ఆటో, బస్సు డ్రైవర్లు కూడా వెన్నునొప్పికి గురవుతున్నట్టు తేలింది. వృద్ధులకు ఎముకలు విరిగిపోతుంటే... యువతకు తుంటి డిస్కులు జారుతున్నాయి. మధ్య వయస్కులు మెడ నొప్పితో బాధ పడుతున్నారు. పదే పదే ఈ భాగాలపై ఒత్తిడి పెరగడం వల్ల అరుగుదలకు గురవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
 
 ఫిజియోథెరపీతో మేలు

 జంట నగరాల్లో వెన్నునొప్పి బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. క్యాన్సర్, హృద్రోగాలతర్వాత అత్యంత ఎక్కువగా న మోద వుతున్న కేసులు ఇవే. ఎటూ కదలకుండా ఆరు గంటల పాటు ఒకే స్థితిలో కూర్చోవడం... గతుకుల రోడ్లపై ఎక్కువ దూరం ప్రయాణించడంతో డిస్కులు దెబ్బతింటున్నాయి. అతిగా మద్యం తాగడం, సిగరెట్ల అలవాటు కూడా ఎముకల అరుగుదలకు మరో కారణం. బాధితుల్లో 98 శాతం మందికి మందులు, ఫిజియోథెరపీతో నయమవుతుంది. కేవలం రెండు శాతం మందికే శస్త్రచికిత్స అవసరం.
 - డాక్టర్ జీపీవీ సుబ్బయ్య, సన్‌షైన్ ఆస్పత్రి.
 
నగరంలో ఏటా కొత్తగా లక్ష మంది వరకు మెడ, నడుం, వెన్ను నొప్పుల బారిన పడుతున్నట్లు ట్విన్ సిటీస్ ఆర్థోపెడిక్, స్పైన ల్ డాక్టర్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది. చెన్నై, బెంగుళూరు, త్రివేండ్రం, కొచ్చిన్‌లతో పోలిస్తే హైదరాబాద్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలిపింది.
 
ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఉత్తమం
పని చేస్తున్న వారిలో 50 శాతం మంది ఏదో ఒక సమయంలో దీని బారినపడుతున్న వారే. బరువులు ఎత్తే సమయంలో వెన్నెముక ఎక్కువగా వంచకూడదు.సాధ్యమైనంత వరకు సాఫీగా ఉన్న రోడ్లపై వాహనాలు నడుపాలి.కూర్చొనే సమయంలో ముందుకు వంగరాదు. దీని వల్ల నడుం నొప్పితో పాటు అధిక బరువు, ఎసిడిటీ, ఊబకాయం, శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి.నిద్రపోయే సమయంలో 50 శాతం సమయం వెల్లకిలా... 20 శాతం సమయం కుడివైపు... మరో 20 శాతం ఎడమ వైపు తిరిగి... పది శాతం బోర్లా పడుకోవాలి. దీంతో పొట్ట, వెన్నుముక కండరాలు రిలాక్స్ అవుతాయి.ఈత కొట్టడం వల్ల వెన్నుముక మరింత గట్టి పడి జీవితకాలం పెరుగుతుంది.
 {పొటీన్లు, క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి.భుజంగాసనం, శలభాసనంతో మెడ కండరాలు బలపడతాయి.
 -డాక్టర్ సీహెచ్ సురేష్, కిమ్స్ ఆస్పత్రి
 
 

మరిన్ని వార్తలు