10 ఎంపీ, 60 ఎమ్మెల్యే సీట్లే లక్ష్యం

10 Apr, 2017 00:53 IST|Sakshi
10 ఎంపీ, 60 ఎమ్మెల్యే సీట్లే లక్ష్యం

తెలంగాణలో మిషన్‌–2019పై బీజేపీ గురి
- ప్రణాళిక రూపొందించుకోవాలని రాష్ట్ర శాఖకు అధినాయకత్వం ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పదికిపైగా ఎంపీ సీట్లు, 60కిపైగా అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే విధంగా మిషన్‌–2019ను సిద్ధం చేసుకోవాలని పార్టీ రాష్ట్ర శాఖను బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఇందుకు అవసరమైన కార్యాచ రణ ప్రణాళికను రూపొందించుకొని పకడ్బం దీగా దాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేసింది. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు సానుకూల పరిస్థితులున్నందున సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. ముఖ్యంగా పోలింగ్‌ బూత్‌ కమిటీల ఏర్పాటు ద్వారా కిందిస్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఈ నెల 7న హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కార్యకర్తల సమ్మేళనం లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొనాల్సి ఉన్నప్పటికీ పార్లమెంటు సమా వేశాలు, కీలక బిల్లులు, ఎన్డీయే సమావేశం కారణంగా ఈ పర్యటన వాయిదా పడటం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వా నికి పార్టీ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ గురించి ఆదేశాలు అందినట్లు సమాచారం. ఒడిశాలో సంస్థా గతంగా పార్టీ పుంజుకోవడంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించ డంతో అదే ఊపును తెలంగాణలోనూ కొనసా గించాలని అధినాయకత్వం నిర్ణయించింది.

జూన్‌ తర్వాత ప్రత్యేక శ్రద్ధ...
ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల తర్వాత జాతీయ నాయకత్వం రాష్ట్రంలో ప్రత్యేక కార్యాచరణను మొదలుపెట్టాలని భావించినా రాజకీయంగా ఢిల్లీ కేంద్రంగా ప్రాధాన్యతలకు అనుగుణంగా కొన్ని మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రాధాన్యతగా నిలవనున్నాయి. తాము కోరుకున్న వారిని ఈ అత్యున్నత పదవుల్లో నియమించుకునేందుకు ఇతర పార్టీలను మంచి చేసుకునేందుకు తనదైన పద్ధతిలో బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో జూన్‌ తర్వాత తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి తన ఫార్ములాను అమలు చేయనున్నట్లు సమాచారం.

ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు ఇతర పార్టీల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, నాయకులను చేర్చుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి బలమైన అభ్యర్థులు లేని చోట ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను చేర్చుకొని ఆ లోటును భర్తీ చేసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.

అధికార టీఆర్‌ఎస్‌కు కింది స్థాయి వరకు కేడర్‌ లేకపోవడం, పూర్తిగా జిల్లా కమిటీలు కూడా ఏర్పడకపోవడం, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్రియా శీలకంగా వ్యవహరించకపోవడం, టీడీపీ పూర్తిగా బలహీన పడటం, వామపక్షాలు సత్తాచాటలేకపోవడం వంటి పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవాలని భావి స్తున్నట్లు ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్ర ›ప్రభుత్వం  అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, ఎన్నికల హామీల అమల్లో వైఫల్యం తదితర అంశాలపై ఉద్యమిస్తూనే పార్టీని సంస్థాగతంగా పూర్తిస్థాయిలో బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు