త్వరలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ

5 Apr, 2017 00:37 IST|Sakshi
త్వరలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ

హైదరాబాద్‌ టెలికం జిల్లా పీజీఎం రాంచంద్ర

సిటీబ్యూరో: బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు హైదరాబాద్‌ టెలికం జిల్లా ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ కె.రాంచంద్ర తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలపై ఇప్పటికే నోకియాతో ఒప్పందం కుదురిందని,  4జీ టెండర్‌ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. ఇందుకోసం త్వరలో 4జీ 339 బీటీఎస్, 3జీ 464 బీటీఎస్, 2జీ 464 బీటీఎస్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే నగరంలో 2జీ 1178 బీటీఎస్, 3జీ 1101 బీటీఎస్‌లు పనిచేస్తున్నాయని చెప్పారు. అదనంగా మెట్రో కారిడార్‌లో 39 బీటీఎస్‌లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. నాగోల్‌ వద్ద ఒక బీటీఎస్‌ ప్రారంభించగా, మరో 21 బీటీఎస్‌ల ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.
 
సొంతంగా వైఫై హాట్‌స్పాట్స్‌..
బీఎస్‌ఎన్‌ఎల్‌ సొంతంగా 51 హాట్‌స్పాట్లను ఏర్పాటు చేసి 381 కేంద్రాలకు అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టిందని పీజీఎం ప్రకటించారు. ఇప్పటికే మైత్రివనం, ఎల్‌బీనగర్‌ కామినేని ఆసుపత్రి, కోఠిలలో హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేసిందన్నారు. మరోవైపు ప్రైవేట్‌ సంస్థ ఒప్పందంతో 42 హాట్‌స్పాట్లు కొనసాగుతున్నాయన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌.. టాటా సంస్థతో కలిసి అంతర్జాతీయ వైఫై సేవలు కూడా ప్రారంభించిందని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లే పర్యాటకులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు.

టెలిఫోన్‌ ఎక్చేంజ్‌ల ఆధునికీకరణ..
బీఎస్‌ఎన్‌ఎల్‌ టెలిఫోన్‌ ఎక్చేంజ్‌లను నూతన టెక్నాలజీతో ఆధునికీకరిస్తున్నుట్లు పీజీఎం తెలిపారు. న్యూ జనరేషన్‌ నెట్‌వర్క్‌ ఫేస్‌–2 ప్రాజెక్ట్‌లో భాగంగా 42 ఎక్చేంజ్‌లను 100.5కే పరికరాలతో ఆధునికీకరించిన్నట్లు పేర్కొన్నారు. మూడు విడతల్లో భాగంగా 200కే పరికరాలతో ఆధునికీకరించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 3,250 లైన్ల సామర్థ్యం ఉన్న ఏడు ఎక్చేంజ్‌లను ఏర్పాటు చేశామన్నారు. త్వరలో మల్టీమీడియా వీడియో కాన్ఫరెన్స్‌ సేవలు కూడా ప్రారంభిస్తామన్నారు.  

రూ.510 కోట్ల రెవెన్యూ..
హైదరాబాద్‌ టెలికం జిల్లా 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.510 కోట్ల రెవెన్యూ సాధించిందని పీజీఎం వెల్లడించారు. ప్రస్తుతం 3.48 లక్షల ల్యాండ్‌లైన్, 71వేల బ్రాడ్‌బ్యాండ్, 13వేల ఎఫ్‌టీటీహెచ్, 9.56 లక్షల మొబైల్‌ ప్రీపెయిడ్, 76వేల పోస్ట్‌పెయిడ్‌ కనెక్షన్లు ఉన్నాయ న్నారు. జీఎం సత్యానందం, రవిచంద్ర, సీతారామరాజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు