రైతు ఉద్ధరణ అంటే ఇదేనా?

5 Apr, 2017 06:39 IST|Sakshi
రైతు ఉద్ధరణ అంటే ఇదేనా?
విశ్లేషణ
కార్పొరేట్ల భారీ రుణాల మాఫీ ఆర్థికంగా అర్థవంతమైన చర్య అని సమర్థిస్తారు. రైతుల రుణ మాఫీ మాత్రం తప్పుడు ఆర్థిక విధానమని, రుణ క్రమశిక్షణారాహిత్యమని అంటారు. కానీ బ్యాంకుల మొత్తం మొండి బకాయిలలో ఒక శాతమే రైతులు బకాయిపడ్డది. మన వ్యవ సాయ పరపతి విధానమే రైతు వ్యతిరేకమైనది. రైతులకు, గ్రామీణ పేదలకు నష్టాన్ని కలుగజేస్తూ సంపన్నులకు మేలును చేకూర్చేలా దాన్ని రూపొందించారు. రైతులను పేదరికంలో ఉంచేయాలని చేస్తున్న ఉద్దేశపూర్వక ప్రయత్నాలలో భాగమే ఇది.
 
అలహాబాద్‌ సమీపంలోని సనంద్‌లో నానో కార్ల కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి గుజరాత్‌ ప్రభుత్వం టాటాలకు రూ. 558.58 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఇంత భారీ మొత్తాన్ని 0.1 శాతం వడ్డీకి 20 ఏళ్లలో తిరిగి చెల్లించే ప్రాతిపదికపై ఇచ్చామని ప్రభుత్వమే తెలిపింది. మరో విధంగా చెప్పాలంటే, తిరిగి చెల్లించాల్సింది 20 ఏళ్ల కాలంలో కాబట్టి దాదాపు వడ్డీ ఏమీ లేకుండానే ఇంత భారీ దీర్ఘకాలిక రుణాన్ని ఇచ్చినట్టు లెక్క. పంజాబ్‌ ప్రభుత్వం భటిండాలో ఎరువుల కర్మాగారాన్ని స్థాపించడానికి ఉక్కు పరిశ్రమ కుబేరుడు లక్ష్మీ నారాయణ్‌ మిట్టల్‌కు రూ. 1,200 కోట్ల రుణాన్ని ఇస్తున్నట్టు వార్తా నివేదికలను బట్టి తెలుస్తోంది. ఆయనకు సైతం ఈ రుణం 0.1 శాతం వడ్డీకే లభించింది.
 
సంపన్నులసేవే బ్యాంకుల విధానమా?
మరోవైపున ఈ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఒక గ్రామంలోని పేదలలోకెల్లా కడు పేదరాలైన ఓ మహిళకు మేకను కొనుక్కోవాలనే కోరిక ఉంది. కాబట్టి ఆమె ఏదైనా ఓ మైక్రో–ఫైనాన్స్‌ సంస్థ(ఎమ్‌ఎఫ్‌ఐ)ను ఆశ్ర యిస్తుంది. అది, 24 నుంచి 36 శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ రేటుకు ఆమెకు రూ. 5,000 రుణాన్ని ఇస్తుంది. ఈ స్వల్ప మొత్తాన్ని ఆమె వారం వారం వాయిదాలలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మేకను పెంచుకోవడానికి ఆ పేదరాలికి ఇచ్చే రూ. 5000 రుణాన్ని... టాటాలకు ఇచ్చినట్టే 0.1 శాతం వడ్డీకి, 20 ఏళ్లలో కాకున్నా  ఐదేళ్లలో తిరిగి చెల్లించే ప్రాతిపదికపై ఇస్తే.. ఏడాది చివరికి ఆమె ఓ నానో కారును నడుపుతుంటుందని మీరూ నిస్సందే హంగా అంగీకరిస్తారు. ఎంతైనా ఆ పేదరాలు కూడా ఓ చిన్న వ్యాపారవేత్తే కదా! ఆమె తన జీవితంలోని ఈ మలి దశలో మనుగడ సాగించడానికి ఓ మేకను పెంచుకుంటే, అదిచ్చే పాలు అమ్ముకుని బతుకుతుంది. బ్యాంకులు ఇలాంటి కనికరంతో దన్నుగా నిలిస్తే కోట్లాదిమందికి సుస్థిరమైన జీవనో పాధికి హామీని ఇస్తుంది.  
 
లేదంటే ఒక రైతు ఉదాహరణనే తీసుకోండి. అతను 12  శాతం వడ్డీ రేటుకు రుణం తీసుకొని ట్రాక్టర్‌ కొనుక్కోవాలి. అదే టాటా అయితే మెర్సి డెజ్‌ బెంజ్‌ లగ్జరీ కారును కేవలం 7 శాతం వడ్డీ రేటు రుణంతోనే కొనుక్కో గలడు. ట్రాక్టర్, రైతు పంటలు పండించే సామర్థ్యాన్ని ఇనుమడింపజేసి, తద్వారా రాబడిని పెంపొందింపజేసే సాంకేతిక పరిజ్ఞానం. రైతు ఉత్పాదక సామర్థ్యంతో పాటూ రాబడిని కూడా పెంపొందింపజేయడానికి తోడ్పడేదిగా ట్రాక్టర్‌ పోషించే పాత్ర నిర్వివాదమైనది. సాగుబడి అనే రైతు జీవనోపాధిని సుస్థిరం చేయడానికి తోడ్పడే పనిముట్టు ట్రాక్టర్‌. కానీ మెర్సిడెజ్‌ బెంజ్‌ కారు సంపన్నుల హోదాకు సంకేతంగానే ఎక్కువగా ఉపయోగపడేది. అలాంటి దాని కోసం వాళ్లు ఎక్కువ చెల్లించగలుగుతారు. పేదలపై ఎక్కువ భారాన్ని మోపుతూ సంపన్నులకు అంత కారు చౌకగా రుణాలను అందించేదిగా బ్యాంకింగ్‌ వ్యవస్థను ఎందుకు రూపొందించారా అని నాకు ఆశ్చర్యం కలుగు తుంటుంది. 
 
పేదల పట్ల చూపుతున్న ఈ ఘోర వివక్ష ఇక్కడితో ముగిసిపోదు. ప్రభుత్వరంగ బ్యాంకులన్నిటి మొండి బకాయిలు లేదా క్రియాశీలంగా లేని ఆస్తుల (ఎన్‌పీఏలు) విలువ రూ. 6.8 లక్షల కోట్లని పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) అంచనా. ఇందులో 70 శాతం కార్పొరేట్‌ సంస్థలు చెల్లించని రుణాలుకాగా, కేవలం 1 శాతం మాత్రమే రైతులు చెల్లించనివి. కార్పొరేట్‌ రంగంలోని మొండి బకాయిలను రద్దు చేస్తామని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణ్యం ఇప్పటికే ప్రకటించారు. ఇలా కార్పొరేట్‌ రుణాలను మాఫీ చేయడాన్ని ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం లేదా పక్షపాతం అంటూ ఎంతటి గగ్గోలు రేగినా గానీ... కార్పొరేట్‌ సంస్థల మొండి బకాయిలను రద్దు చేయాల్సినవిగానే పెట్టుబడిదారీ విధానం రూపొందిందని ఆయన చెప్పారు.
 
రూ. 4 లక్షల కోట్ల ఎన్‌పీఏలను రద్దు చేస్తారని ‘ఇండియా రేటింగ్స్‌’ సంస్థ అంచనా కట్టింది. మరో విధంగా చెప్పాలంటే, ప్రధాన ఆర్థిక సలహా దారు చెప్పే మాటలను విశ్వసించేట్టయితే అంత భారీ రుణాలను మాఫీ చేసేయడం ఆర్థికంగా అర్థ వంతమైన చర్యే అవుతుంది. కానీ, రైతులు బకాయిపడ్డ రుణాలను మాఫీ చేయడం తప్పుడు ఆర్థిక విధానమనీ, అది రుణపరమైన క్రమశిక్షణా రాహిత్యానికి దారితీస్తుందనీ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చైర్‌పర్సన్‌ శ్రీమతి అరుంధతి భట్టాచార్య మరోవంక వాపోతు న్నారు. ఇంతాచేసి మొత్తం ఎన్‌పీఏలలో (మొండి బకాయిలలో) ఒక శాతం మాత్రమే రైతులు బకాయిపడ్డవి.  
 
బడ్జెట్‌లోనూ బడుగు రైతుకు రిక్తహస్తమే
ఏటా వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణంలో చాలా వరకు అగ్రిబిజినెస్‌ సంస్థలకు లబ్ధి చేకూర్చడానికే పోతుంది. 2017 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వ్యవసాయ రుణం రూ. 10 లక్షల కోట్లని ప్రకటించారు. వ్యవ సాయ రుణం కోసం ఇంత భారీ మొత్తాన్ని కేటాయించే ప్రభుత్వం ఎంతగా రైతుల కోసం ఆలోచిస్తున్నదోనని అనిపిస్తుంది. కానీ ఇందులోంచి అసలు చిన్న రైతులకు అందేది వాస్తవానికి 8 శాతం మాత్రమే. మొత్తం రైతులలో చిన్న రైతులు దాదాపు 83 శాతం. రూ. 10 లక్షల కోట్ల వ్యవసాయ రుణంలో దాదాపు 75 శాతం పరపతిని అగ్రిబిజినెస్‌ కంపెనీలు, బడా రైతులు ప్రభుత్వ సహాయంతో 3 శాతం వడ్డీ రేటుకే పొందుతారు. కాలక్రమేణా వ్యవసాయ రుణం అంటే ఏమిటనే నిర్వచనం విస్తరిస్తూపోయి గిడ్డంగుల కంపెనీలు, వ్యవసాయ ఉపకరణాల తయారీ సంస్థలు, ఇతర అగ్రిబిజినెస్‌ సంస్థలు అన్నీ అందులోకి చేరాయి. 
 
రైతుల పట్ల బ్యాంకులు చూపుతున్న ఈ ఉదాసీన వైఖరి కారణంగానే ఇటీవలి ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ ఎన్నికల్లో రైతుల రుణ మాఫీ వాగ్దానం అంతటి వివాదాస్పద అంశంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాగ్దానం చేశారు. కాబట్టి ఉత్తరప్రదేశ్‌ రైతు రుణ మాఫీ ఆర్థిక భారం బాధ్యతను కేంద్రమే తీసుకుం టుందని ఇప్పటికే కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రక టించింది. కాగా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన పంజాబ్‌లో ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్‌ బాదల్‌... రైతు రుణ మాఫీ ఆర్థిక భారాన్ని మోయడానికి ఒక వినూత్న మార్గాన్ని ఆవిష్కరించారు. రైతుల రుణ బకాయిలను ప్రభు త్వం ‘స్వాధీనం చేసుకుంటుంద’ని, రైతుల బకాయిలను ప్రభుత్వం తిరిగి చెల్లించడానికి బ్యాంకులతో దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకుంటుందనీ తెలిపారు.
 
రైతు రుణ మాఫీలోనూ అసంబద్ధతే 
పంజాబ్‌లో రైతులు బకాయిపడ్డ మొండి రుణాలు దాదాపు రూ. 35,000 కోట్లని అంచనా. ఉత్తరప్రదేశ్‌లో రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమికి యజ మానులైన రైతుల బకాయిల మాఫీ మొత్తం రూ. 36,000 కోట్ల వరకు ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి రైతు రుణ మాఫీకి అయ్యే ఖర్చును తిరిగి చెల్లించడానికి కేంద్రం అంగీకరించినప్పుడు అదే పనిని ఇతర రాష్ట్రాల విషయంలో అది ఎందుకు చేయకూడదు? అని ప్రశ్నిస్తున్నారు. ఉదాహర ణకు, మహారాష్ట్ర ప్రభుత్వం రైతు రుణ మాఫీ కోసం రూ. 30,500 కోట్లు అడుగుతోంది. 2009 నుంచి ఆ రాష్ట్రంలో 23,000 మంది రైతులు ఆత్మహత్య లకు పాల్పడ్డారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ మహారాష్ట్ర శాసనసభకు తెలిపారు.
 
తమిళనాడు వరుసగా మూడో ఏడాది వర్షాభావ పరిస్థితులను ఎదు ర్కొంటున్నది. ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే కరువు నెలకొన్నదని ప్రకటిం చింది. రైతులు ఎకరాకు రూ. 25,000 పరిహారాన్ని చెల్లించాలని కోరు తున్నారు. ఇదిలా వుండగా, ఒడిశాలో కూడా రైతు ఆత్మహత్యల పెరుగుదల పుంజుకుంది. ఈశాన్యంలో రైతు ఆత్మహత్యల సంఖ్య గత కొన్నేళ్లతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగింది.
 
రైతు మెడకు పేదరికం ఉచ్చు 
రైతులను పేదరికంలో ఉంచేయడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగు తుండటమే దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న భయానకమైన వ్యవసాయ సంక్షో భానికి ప్రాథమిక కారణం. దురదృష్టవశాత్తూ ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా గ్రహించడం లేదు. రైతుల ఉత్పత్తులకు మంచి ధరలను చెల్లించకపోవడం మాత్రమే కాదు, రైతులకు గ్రామీణ పేదలకు నష్టాన్ని కలుగజేస్తూ సంపన్ను లకు మేలును చేకూర్చేలా పరపతి విధానాన్నే తప్పుడు పద్ధతిలో రూపొం దించారు. కానీ బ్యాంకులు తమ తప్పును అంగీకరించి, వాటి పరపతి విధానాలను తిరిగి రూపొందిస్తాయా?  నాకైతే ఆ విషయంలో తీవ్ర అనుమా నాలే ఉన్నాయి. వృద్ధికి ప్రోత్సాహం పేరిట సంపన్నవంతులైన కార్పొరేట్‌ అధిపతులు ప్రభుత్వం నుంచి పన్ను రాయితీలను, భారీ సబ్సీడీలను పొందు తూనే ఉంటారు.
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
దేవిందర్‌శర్మ 
ఈమెయిల్‌ : hunger55@gmail.com
Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా