సత్య నాదెళ్లకు మీరా స్ఫూర్తి?

7 Jun, 2016 01:27 IST|Sakshi
సత్య నాదెళ్లకు మీరా స్ఫూర్తి?

- సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదం
- పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్
 
 సాక్షి, హైదరాబాద్: స్వయంకృషితో అత్యున్నత స్థానానికి ఎదిగిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు తానే స్ఫూర్తిని ఇచ్చానని సీఎం చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోనూ, దేశవిదేశాల్లోనూ ఎవరు ఏ ఘనత సాధించినా ఆ విజయం సొంతం చేసుకునేందుకు చంద్రబాబు తాపత్రయపడుతూ ఉంటారని బుగ్గన విమర్శించారు. సత్య నాదెళ్ల కెరీర్‌ను చూస్తే బాబు చెప్పేది అబద్ధమని తెలుస్తుందన్నారు. 1988లో మణిపాల్ వర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్న సత్య అమెరికా వెళ్లి అక్కడే ఎమ్మెస్, ఎంబీఏ చదివి 1990లో సన్ మైక్రోసిస్‌లో చేరారన్నారు. మైక్రోసాఫ్ట్‌లో1992లో చేరి అంచెలంచెలుగా ఎదిగి సీఈవో అయ్యారన్నారు.

ఇక సత్య తండ్రి బి.ఎన్.యుగంధర్ (ఐఏఎస్ అధికారి) తన వద్దే పని చేశారని బాబు చెప్పుకోవడం మరీ వింత అన్నారు.యుగంధర్ రాష్ట్రంలో చివరిగా పని చేసింది 1986 నుంచి 88 వరకు అని, అప్పట్లో ఆయన పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా ఉన్నారన్నారు. చంద్రబాబు సీఎం అయిందే 1995లో అయినపుడు యుగంధర్ ఆయన దగ్గర పని చేశారని చెప్పడం వింతగా ఉందన్నారు.

 ఐటీ స్థానమెందుకు దిగజారింది..?
 ఐటీ అనే పదాన్ని తానే కనిపెట్టానని చెప్పుకుంటున్న చంద్రబాబు.. తొలిసారి ముఖ్యమంత్రి అయ్యేనాటికి  ఐటీలో ఏపీ మూడో స్థానంలో ఉంటే 2004లో పదవి నుంచి దిగిపోయేనాటికి 5వ స్థానానికి ఎందుకు దిగజారిందని ప్రశ్నించారు.

 లోకేశ్ మాటేమిటి : ఎంతో మందికి స్ఫూర్తినిచ్చానని చెప్పుకున్న చంద్రబాబు నుంచి ఆయన కుమారుడు లోకేశ్ ఎందుకు స్ఫూర్తి పొందలేకపోయారో చెప్పాలని నిలదీశారు.

మరిన్ని వార్తలు