‘మమ్మీ’కి ప్రాణం..!

5 Oct, 2016 02:15 IST|Sakshi
‘మమ్మీ’కి ప్రాణం..!

- జర్మనీ నుంచి ఆక్సిజన్ ఫ్రీషోకేస్ కొనుగోలు
- విదేశీ సంస్థతో ఒప్పందం.. మరో నెలలో ఏర్పాటు
- షోకేస్‌లోకి గాలిచొరబడకుండా నైట్రోజన్ జనరేటర్
- ఇప్పటికీ మమ్మీ సురక్షితమేనని స్కానింగ్, ఎక్స్‌రే ద్వారా నిర్ధారణ
 
 సాక్షి, హైదరాబాద్: మనిషికి ప్రాణవాయువు గాలి.. అది అందకుంటే ఉక్కిరిబిక్కిరవుతాడు.. కానీ అదే ఆక్సిజన్ ‘ఆమె’ను అవసానదశకు చేర్చింది.. ఇప్పుడు ఆమెను రక్షించేం దుకు ఆక్సిజన్ అందకుండా చేయబోతున్నా రు. ఇందుకోసం జర్మనీ నుంచి ప్రత్యేక పరికరాన్ని తెప్పిస్తున్నారు. ఇదంతా డాక్టర్ వైఎస్సా ర్ స్టేట్ మ్యూజియంలో ఉన్న ‘మమ్మీ’ కథ.

 స్టేట్ మ్యూజియంలో ఉన్న ప్రత్యేకతల్లో ముఖ్యమైంది ఈజిప్షియన్ మమ్మీ. సందర్శకులు దీన్ని ఆసక్తిగా తిలకిస్తుంటారు. అందుకే మ్యూజియం హాలులో ప్రాధాన్యం కల్పించి దీన్ని ఏర్పాటు చేశారు. కానీ దానికి శాస్త్రీయ సురక్షిత కవచం లేకపోవటంతో వాతావరణ పరిస్థితులు, వాయు, శబ్ద కాలుష్యం బారిన పడి దెబ్బతింది. ఇప్పుడు దీన్ని ‘రక్షించేం దుకు’ పురావస్తు శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రూ.58 లక్షలు వెచ్చించి ఆక్సిజన్ జొరబడని ఎయిర్ ఫ్రీ గ్లాస్ షోకేసును కొంటోంది. ఈ మేరకు జర్మనీకి చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. మరో నెల రోజుల్లో ఈ షోకేసు నగరానికి చేరనుంది.

 ఎందుకీ పరిస్థితి..
 దేశంలోని ఆరు ప్రాంతాల్లో ఈజిప్షియన్ మమ్మీలు ఉన్నాయి. ఇందులో దక్షిణాదిలో ఏకైక మమ్మీ మన స్టేట్ మ్యూజియంలో కొలువుదీరింది. 2353 ఏళ్ల క్రితం చనిపోయిన యువతి శవాన్ని ఈజిప్షియన్ పద్ధతుల్లో మమ్మీగా మార్చారు. దాన్ని ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ అల్లుడు వేయి పౌండ్లు వెచ్చించి భాగ్యనగరానికి తెప్పించారు. ఆ తర్వాత ఇది ఏడో నిజాం మీర్‌ఉస్మాన్ అలీఖాన్‌కు బహుమతిగా రావటంతో 1930లో దాన్ని ఆయన స్టేట్ మ్యూజియంకు బహూకరించారు. అప్పటి నుంచి అది మ్యూజి యంలో ప్రధాన ఆకర్షణగా ఉంది. 4 వైపులా అద్దాలున్న చెక్క షోకేసులో ఈ మమ్మీని ఉంచారు. దీంతో లోనికి సులభంగా ఆక్సిజన్ జొరబడి బ్యాక్టీరియా ఉత్పన్నమై మమ్మీ క్రమంగా శిథిలమవుతూ వచ్చింది.

బాగా దెబ్బతిన్నాకగానీ పురావస్తు శాఖ అధికారులు దీనిని గుర్తించలేదు. దీంతో మమ్మీని ఎలా కాపాడాలో తెలియక ఇరాన్‌కు చెందిన నిపుణులకు కబురుపెట్టారు. వారు వచ్చి వెంటనే ఆక్సిజన్ ఫ్రీ షోకేస్ ఏర్పాటు చేయాలని చెప్పటంతో ఇప్పుడు దాన్ని తెప్పించే ఏర్పాట్లు చేశారు. ఇటీవల ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకటన ఇవ్వటంతో జర్మనీకి చెందిన గ్లాస్‌బా అనే సంస్థ రూ.58 లక్షలకు కొటేషన్ వేసి ఎంపికైంది. ఇప్పుడు ఆ సంస్థతో పురావసు ్తశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. మూడేళ్ల వారంటీ తో మరో నెల రోజుల్లో అది ఆక్సిజన్ ఫ్రీ షోకేస్‌ను సమకూర్చనుంది. దీనికి నైట్రోజన్ సరఫరా చేసే జనరేటర్ కూడా ఉంటుంది. ఇది బ్యాక్టీరియాను నియంత్రిస్తుంది.
 
 ఆ మమ్మీ 16 ఏళ్ల యువతిది కాదట..
 మ్యూజియంలో ఉన్న మమ్మీ ఈజిప్టు రాజకుటుంబానికి చెందిన 16 ఏళ్ల యువతిదిగా భావిస్తూ వచ్చారు. కానీ.. ఇటీవల స్కానింగ్, ఎక్స్‌రేలు తీసి పరిశీలించగా, అది 25 ఏళ్ల యువతిదని తేల్చారు. ఇప్పటికీ మెదడులోని కొంతభాగం చెక్కుచెదర లేదని, ఇతర ప్రధాన శరీర భాగాలు కూడా బాగానే ఉన్నాయని తేలింది. ఇది తదుపరి పరిశోధనలకూ ఉపయోగపడుతుందని గుర్తించారు.

మరిన్ని వార్తలు