మన ఎయిమ్స్‌పై కేంద్రం నిర్లక్ష్యం!

6 Jan, 2018 03:48 IST|Sakshi

నిధుల విడుదలలో జాప్యం 

హిమాచల్‌ ఎయిమ్స్‌కు రూ.1,350 కోట్ల నిధులు 

తెలంగాణ ఎయిమ్స్‌కు ఏడాదైనా అడుగు ముందుకు పడని వైనం 

సాక్షి, న్యూఢిల్లీ: గత ఏడాది వార్షిక బడ్జెట్‌లో తెలంగాణకు ప్రకటించిన ఆల్‌ఇండియా మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఏర్పాటు విషయంలో కేంద్రం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణకు ఎయిమ్స్‌ మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంట్‌లో ప్రకటన చేసి ఏడాది కావస్తున్నా ఇంత వరకు నిధులు విడుదల కాలేదు. ఈ విషయమై టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఎన్నిసార్లు కేంద్రానికి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్‌ ఎయిమ్స్‌ విషయంలో మాత్రం కేంద్రం ఆగమేఘాల మీద ఆమోదం తెలిపి నిధుల విడుదలపై స్పష్టతనిస్తూ నిర్మాణం పూర్తికి లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకుంది. గత బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

హిమాచల్‌లోని బిలాస్‌పూర్‌లో ఎయిమ్స్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి వర్గం రూ. 1,350 కోట్ల నిధులు విడుదల చేసేందుకు అంగీకరించడంతోపాటు 48 నెలల్లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. హిమాచల్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం, కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఇదే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అక్కడ ఎయిమ్స్‌ ఏర్పాటులో కేంద్రం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని టీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఎయిమ్స్‌కు నిధుల విడుదల విషయంలో తీవ్ర జాప్యం చేస్తోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. బీబీ నగర్‌లో ఎయిమ్స్‌ ఏర్పాటుకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు అభ్యర్థనలు చేసినా కేంద్రం స్పందించలేదు. కేవలం రాజకీయ కారణాలతో హిమాచల్‌ప్రదేశ్‌ విషయంలో ఒక రకంగా తెలంగాణ విషయంలో మరో రకంగా కేంద్రం వ్యవహరిస్తోందని టీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎయిమ్స్‌కు నిధులు విడుదల చేయాల్సిందిగా ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ శుక్రవారం మరోసారి కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలసి వినతిపత్రాన్ని ఇచ్చారు. 

>
మరిన్ని వార్తలు