సిటీ పోలీసులతో పోలో టీమ్

24 Dec, 2013 05:47 IST|Sakshi
సిటీ పోలీసులతో పోలో టీమ్

 = పోలీసు మీట్స్‌లో పాల్గొనేందుకు తర్ఫీదు
 = స్టేబుల్స్ ప్రారంభోత్సవంలో వెల్లడించిన కొత్వాల్

 
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనరేట్ తరఫున అశ్వక దళం నుంచి ఎంపిక చేసిన వారితో పోలో టీమ్‌ను తయారు చేయనున్నట్లు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ సోమవారం వెల్లడించారు. గోషామహల్‌లో ఉన్న మౌంటెడ్ పోలీసు (అశ్వక దళ) కార్యాలయంలో కొత్తగా నిర్మించిన గుర్రపు శాలల (స్టేబు ల్స్) ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భం గా కొత్తగా వచ్చి చేరిన పది గుర్రాలను ఈ విభాగానికి అందించారు. నగర పోలీసు కమిషనర్‌గా అనురాగ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆయన భార్య మమత అనురాగ్ శర్మ అధికారిక కార్యక్రమానికి విచ్చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న స్టేబుల్స్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కొత్వాల్ మాట్లాడుతూ నగర అదనపు పోలీసు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అంజనీకుమార్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఆయన కృషి వల్లే 10 కొత్త గుర్రాలు సైతం నామమాత్రపు ధరకు సమకూరాయి. వీటికి అవసరమైన  శిక్షణను ఇవ్వనున్నాం. మౌంటెడ్ పోలీసుకు కేటాయించిన గుర్రాల సంఖ్య 40 కాగా ప్రస్తుతం 29 ఉన్నాయి. మిగిలిన వాటినీ దశల వారీగా సమకూర్చుకుంటాం. ఆలిండియా పోలీసు డ్యూటీ మీట్స్/స్పోర్ట్స్ మీట్స్‌లో పాల్గొనేందుకు సిటీ పోలీసు తరఫున పోలో టీమ్‌ను తయారు చేస్తాం’ అని అన్నారు.

అనురాగ్ శర్మ భార్య మమత అనురాగ్ సైతం పోలీసు అధికారిణే. నగరానికి చెందిన మమత ఆయనతో పాటే 1982లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. వెస్ట్ బెంగాల్ క్యాడర్‌కు ఎంపికైనా ఆ తరవాత ఆంధ్రప్రదేశ్‌కు ఎలాట్ అయ్యారు. వివిధ హోదాల్లో పని చేసి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. మమత అనురాగ్ మాట్లాడుతూ ‘ఈ గుర్రాలను చూస్తుంటే మరోసారి ఫిట్‌నెస్ సంపాదించి గుర్రపు స్వారీ చేయాలని ఉంది’ అన్నారు.

వివిధ డ్యూటీ/స్పోర్ట్స్ మీట్స్‌లో పాల్గొని పతకాలు సాధించిన పోలీసులకు ప్రస్తుతం లభిస్తున్న నామమాత్రపు ప్రోత్సాహకాలు భారీగా పెరగనున్నాయని అదనపు డీజీ (క్రీడలు) రాజీవ్ త్రివేది అన్నారు. స్వర్ణ పతకం సాధిస్తే రూ.3 లక్షలు రివార్డు, మూడు ఇంక్రిమెంట్లు, కాంస్య పతకానికి రూ.2 లక్షలు, రెండు ఇంక్రిమెంట్లు, రజతానికి రూ.లక్ష, ఒక ఇంక్రిమెంట్ ఇచ్చే ప్రతిపాదనతో కూడిన ఫైల్ ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందన్నారు. సిటీ పోలీసులూ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని మంచి పేరు తేవాలని కోరారు.
 
క్రైమ్ సమాచారం ఐపాడ్స్‌లో...
 
ఈ కార్యక్రమంలో నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న డీసీపీ స్థాయి అధికారులకు కమిషనర్ అనురాగ్ శర్మ ఐపాడ్స్ అందించారు. వీటిలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయనున్నారు. అందులో ఉన్న ఫార్మట్ ప్రకారం కేసులు, దర్యాప్తు తీరుతెన్నుల్ని అధికారులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సమీక్ష సమావేశాలకు అధికారులు హాజరవుతున్నప్పుడు అంతా ఒకే రకంగా నివేదికలు రూపొందించట్లేదని కమిషనర్ గుర్తించారు. దీనికి పరిష్కారంగానే ఐపాడ్స్ అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల డీసీపీలు అవసరమైన సమాచారాన్ని ప్రతి రోజూ అప్‌డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఓ అధికారి తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు