చికిత్స కోసం వెళితే చితకబాదారు

4 May, 2015 21:55 IST|Sakshi

హెదరాబాద్(కుషాయిగూడ): కడుపునొప్పితో బాధపడుతున్న కుమారుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లిన ఓ తండ్రిని ఆసుపత్రికి చెందిన డాక్టర్లు, సిబ్బంది చితకబాదిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. వివరాలు.. వాసవి శివనగర్‌ కు చెందిన చంద్రశేఖర్ ఆదివారం రాత్రి సమయంలో కడుపునొప్పితో బాధపడుతున్న తన కుమారుడు రితీష్ (12)ను స్థానిక రాఘవేంద్రా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తన కుమారుడికి వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందిని కోరి ఆరోగ్యశ్రీ వార్డులో చేర్పించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ ప్రవీణ్, రితీష్‌ను పరీక్షించారు. బాలుడు అపెంటీసైడ్ నొప్పితో బాధపడుతున్నాడని 24 గంటల్లో ఆపరేషన్ చేయక పోతే బాబు ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు.


అందుకు తండ్రి చంద్రశేఖర్ ప్రస్తుతానికి వైద్యం అందించి ఆరోగ్యశ్రీ అనుమతి వచ్చాక ఆపరేషన్ చేయాలంటూ వేడుకున్నాడు. దీంతో బాలుడి ప్రాణానికి ప్రమాదం ఉందంటే ఆరోగ్యశ్రీ అనుమతులు అంటావా ? అంటూ అసభ్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. అంతా మాత్రాన పిల్లలను కనడం ఎందుకంటూ దూషించడంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. ఈ క్రమంలో డాక్టర్ ప్రవీణ్‌తో పాటుగా ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది చంద్రశేఖర్‌ను గదిలో బంధించి చితకబాదారు. డాక్టర్ స్టెతస్కోప్‌తో విచక్షణ రహితంగా దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు. కాగా ఇరువురు ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రాథమికంగా విచారణ చేపట్టి ఆసుపత్రిలోని సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకుని.. దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నర్సింగరావు తెలిపారు. అయితే డాక్టరు 24 గంటల్లో ఆపరేషన్ చేయాలి లేదంటే ప్రాణాలు దక్కవని చెప్పిన బాలుడు రితీష్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండటం కొసమెరుపు.

>
మరిన్ని వార్తలు