బాగవుతుందని వెళ్తే కొత్త రోగాలు!

10 Oct, 2016 01:59 IST|Sakshi
బాగవుతుందని వెళ్తే కొత్త రోగాలు!

- ప్రభుత్వాస్పత్రుల్లో వ్యవస్థాగత లోపాలపై మంత్రి కేటీఆర్
- మృత్యువుకు చేరువైన వారికి ‘స్పర్శ్’ సేవలు భేష్ అని కితాబు
- తన వేతనం నుంచి నిర్వాహకులకు రూ. 5 లక్షల చెక్కు అందజేత

 
సాక్షి, హైదరాబాద్: రోగం నయం చేయించుకుందామని ప్రభుత్వాస్పత్రులకు వెళ్తే కొత్త ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయని పురపాలక, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. సర్కారు దవాఖానాల్లో నెలకొన్న వ్యవస్థాగత లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని చెప్పారు. ప్రపంచ ఉపశాంతి (పాలియేటివ్ డే) దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ (బంజారాహిల్స్)లోని ‘స్పర్శ్ హాస్పైస్’లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. అధికారంలో ఉన్నప్పటికీ వ్యవస్థలో ఉన్న లోపాలను ఒప్పుకోక తప్పదని, ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల సర్కారు ఆస్పత్రుల్లోనూ ఇప్పుడిప్పుడే సౌకర్యాలు మెరుగవుతున్నాయన్నారు. సర్కారీ వైద్యానికి ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వం బడ్జెట్‌లో అధిక కేటాయింపులు చేసిందన్నారు.
 
 ‘స్పర్శ్’ సేవలు అభినందనీయం
 మరణించే దశలో ఉన్నవారు కూడా బతికున్నంత వరకు గౌరవంగానే జీవించాలని కోరుకుంటారని, అటువంటి వారికి స్పర్శ్ హాస్పైస్ సిబ్బంది నిరుపమాన సేవలు అందిస్తున్నారని కేటీఆర్ కొనియాడారు. ముఖ్యంగా అవసాన దశలో ఉన్న కేన్సర్  రోగుల కోసం స్పర్శ్ హాస్పైస్‌ను ఏర్పాటు చేసి సమయాన్ని కేటాయిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ సభ్యులు, విరాళాలందిస్తున్న దాతలను ఆయన అభినందించారు. స్పర్శ్ ద్వారా ఇప్పటివరకు 800 మందికి ఈ తరహా సేవలనందించి గౌరవంగా సాగనంపారని, భవిష్యత్తులోనూ అవసాన దశలో ఉన్న మరింత మందికి స్పర్శ్ సేవలను అందించాలని మంత్రి ఆకాంక్షించారు.
 
 స్పర్శ్ హాస్పైస్ విస్తరణకు అవసరమైన భూమిని ప్రభుత్వం ద్వారా ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. వచ్చే దసరాకల్లా మంచి వాతావరణం, సువిశాల ప్రాంగణంలో స్పర్శ్ సేవలు లభ్యమయ్యేలా ప్రణాళిక రూపొందించాలని నిర్వాహకులకు సూచిం చారు. స్పర్శ్ నిర్వహణ నిమిత్తం నెలకు అయ్యే వ్యయం రూ. 5 లక్షలను తన వేతనం నుంచి ఇస్తున్నట్లు ప్రకటించారు. వెనువెంటనే స్పర్శ్ నిర్వాహకులకు రూ. 5 లక్షల చెక్కును మంత్రి కేటీఆర్ అందజేశారు.
 
 జిల్లా ఆసుపత్రుల్లోనూ ఉపశాంతి సేవలు
 స్పర్శ్ హాస్పైస్‌లో అందిస్తున్న సేవల మాదిరిగానే ప్రతి జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రిలోనూ ఐదు పడకలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ చెప్పారు. స్పర్శ్ విస్తరణకు ప్రభుత్వపరంగా అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ అధ్యక్షురాలు ప్రణ తి, స్పర్శ్ సంస్థ నిర్వాహకులు సురేశ్‌రెడ్డి, సుబ్రమణ్యం, రామ్మోహన్‌రావు, అనూప్ అగర్వాల్, వరప్రసాద్‌రెడ్డి, సాక్షి డెరైక్టర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) రాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు