రాజకీయ  అవగాహన ఉండాలి.. ఓటేయాలి 

16 Nov, 2023 11:41 IST|Sakshi

భాగస్వామి పట్ల మహిళల అభిప్రాయం

డేటింగ్‌ యాప్‌ అధ్యయనంలో వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయాల పట్ల ఆధునికులు నిర్లిప్తంగా ఉంటారనే అభిప్రాయం తప్పని ఓ అధ్యయనం నిరూపించింది. తమ భాగస్వామి తప్పనిసరిగా రాజకీయ–సామాజిక అవగాహన కలిగి ఉండాలని ఆధునికులు, ముఖ్యంగా మహిళలు భావిస్తున్నారు. అంతేకాదు వారు తప్పకుండా ఓటు వేయాలని కూడా ఆశిస్తున్నారు. మహిళలకు సంబంధించిన తొలి డేటింగ్‌ యాప్‌ బంబుల్‌ తాజాగా విడుదల చేసిన వార్షిక డేటింగ్‌ ట్రెండ్స్‌ 2024 నివేదికలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

25వేల మందికి పైగా పాల్గొన్న ఈ అధ్యయనంలో రాజకీయాలు, సామాజిక అంశాలపై సాధారణ అవగాహనకు భిన్నమైన ఆలోచనలు వెల్లడి కావ డం విశేషం. అధ్యయనంలో పాల్గొన్న ప్రతీ నలుగురిలో ఒకరు తమ భాగస్వామి రాజకీయాలు, సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నారు. ఇది తమ భాగస్వామిని మరింత ఆకర్షణీయంగా మారుస్తుందని భావిస్తున్నారు. అదీగాక, 41% మంది తమ భాగస్వామి ఓటు వేయడం కూడా తమకు ముఖ్యమన్నారు.

తమకు భిన్నమైన రాజకీయ దృక్కోణాలు ఉన్న వారి దగ్గర మహిళలు తక్కువ ఓపెన్‌గా ఉంటారని కూడా అధ్యయనం వెల్లడించింది. డేటింగ్‌ చేస్తున్న ప్రతీ ముగ్గురిలో ఒకరు (33%) సామాజిక సమస్యలపై నిరాసక్తతతో ఉంటే భాగస్వామికి దూరం జరుగుతున్నారు. భాగస్వామితో కలిసి ఉండాలని కోరుకునేందుకు మానవ హక్కుల సమస్యలు ముఖ్య కారణమని 64% మంది, భాగస్వామికి విలువల పట్ల మక్కువ ఉండాలని 38% మంది మహిళలు చెప్పారు.   

మరిన్ని వార్తలు