హైదరాబాద్‌కు రెండంతస్తుల రైలు

28 Feb, 2014 09:21 IST|Sakshi
హైదరాబాద్‌కు రెండంతస్తుల రైలు

 మరో నెలలో సేవలు ప్రారంభం
 సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన డబుల్ డెక్కర్ రైలు వచ్చేసింది. ఎరుపు, పసుపు రంగుల్లో అందంగా ముస్తాబైన డబుల్ డెక్కర్ రైలు గురువారం హైదరాబాద్ నగరానికి వచ్చేసింది. దేశంలో ప్రస్తుతం నడుస్తున్న డబుల్ డెక్కర్ రైళ్లన్నింటికంటే మరింత అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైలు త్వరలోనే అందుబాటులోకి రానుంది. రైల్వే భద్రతా కమిషన్ నివేదిక అనంతరం మరో నెల రోజుల్లో ఈ ట్రైన్ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది.

కాచిగూడ నుంచి తిరుపతి, కాచిగూడ నుంచి గుంటూరు మార్గాల్లో ఈ డబుల్ డెక్కర్ రైలు నడవనుంది. గురువారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో డబుల్ డెక్కర్ ట్రైన్‌ను రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రయాణికులను అప్రమత్తం చేసే అలార్మ్ వ్యవస్థ ఈ ట్రైన్ ప్రత్యేకత అని, ఇప్పటి వరకు మరే డబుల్ డెక్కర్ ట్రైన్‌కు ఈ సదుపాయం లేదని మంత్రి వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సునీల్‌కుమార్ అగర్వాల్, సీపీఆర్వో కె.సాంబశివరావు, తదితరులు మంత్రి వెంట ఉన్నారు.
 
 దేశంలో ఇది ఆరో డబుల్ డెక్కర్..
  ఇది దేశంలో 6వ డబుల్ డెక్కర్ రైలు. ఇప్పటి వరకు ధన్‌బాద్-హౌరా (12385/86), అహ్మదాబాద్-ముంబై (12932/31), ఢిల్లీ-జైపూర్ (12986/85), ఇండోర్ నుంచి హజారీబాగ్, భోపాల్ (2216/ 185), బెంగళూర్-చెన్నై (22626/625) మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు సేవలందిస్తున్నాయి.
 
  ఈ కొత్త రైలుకు 14 ఏసీ చైర్‌కార్స్, 3 పవర్ బోగీలు ఉంటాయి. పూర్తి ఏసీ సదుపాయంతో నడిచే ఈ ట్రైన్‌లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వంటివి చోటు చేసుకున్నప్పుడు ప్రాథమిక స్థాయిలోనే పొగ, మంటలను గుర్తించి ప్రయాణికులను అప్రమత్తం చేసే వెస్‌డా (వెరీ ఎర్లీ స్మోక్/ఫైర్ డిటెక్షన్ విత్ అలార్మ్) టెక్నాలజీని ఏర్పాటు చేశారు.
 
  *ఈ ట్రైన్ లోయర్ డెక్‌లో 48 సీట్లు, అప్పర్ డెక్‌లో 50 సీట్లు ఉంటాయి. మిడిల్ డెక్‌లో 22 సీట్లు ఉంటాయి.
 
* ఒక బోగీలో 120 సీట్ల చొప్పున మొత్తం 14 బోగీల్లో 1,680 సీట్లు ఉంటాయి.
 
* భద్రతా ప్రమాణాల పరిశీలన తర్వాత ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న ఈ ట్రైన్ కాచిగూడ-గుంటూరు బై వీక్లీ, కాచిగూడ -తిరుపతి బై వీక్లీగా నడవనుంది.
 
*కాచిగూడ నుంచి తిరుపతికి 10 గంటల్లో, గుంటూరుకు 5 గంటల్లో చేరుకుంటుంది. ఈ ట్రైన్ పగటిపూట మాత్రమే నడుస్తుంది. ప్రయాణికులు కూర్చొని వెళ్లవలసి ఉంటుంది.
 

మరిన్ని వార్తలు