అర్ధరాత్రి హైడ్రామా.. పోలీసులతో మధుయాష్కీ వాగ్వాదం

15 Nov, 2023 10:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ మరోసారి రాజకీయం హీటెక్కింది. ఎన్నికల వేళ ఐటీ దాడులు, పోలీసులు సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ నేతలను టార్గెట్‌ చేసి దాడులు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక, తాజాగా మంగళవారం అర్ధరాత్రి కాంగ్రెస్‌ ఎల్బీ నగర్‌ అభ్యర్థి మధు యాష్కీ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. దీంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కీ నివాసంలో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి సోదాలు చేశారు. మధుయాష్కీ నివాసంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు సోదాలు చేశారు. ఈ సందర్బంగా మధుయాష్కీ ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉంచి డబ్బులు పంచుతున్నాడని ఫిర్యాదు రావడంతో తనిఖీ చేసేందుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో, పోలీసులు, ఆయన మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మధుయాష్కీ మద్దతుదారులు పోలీసులతో కాసేపు వాగ్వాదానికి దిగారు. 

ఈ సందర్బంగా మధు యాష్కీ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ ఒత్తిడితోనే పోలీసులు సోదాల పేరుతో ఇంట్లోకి ప్రవేశించారని అన్నారు. పోలీసులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీ ఎలా నిర్వహిస్తారని మధుయాస్కీ వారిని ప్రశ్నించారు. అర్ధరాత్రి సోదాల పేరుతో పోలీసులు తన కుటుంబ సభ్యులను, కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోతామన్న భయంతోనే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోలీసులను పంపారని ఆరోపించారు. కాగా, పోలీసుల సోదాలపై కాంగ్రెస్‌ నేతలు స్పందించారు. విచారణ పేరుతో మధుయాష్కీ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇదిలా ఉండగా.. ఈ సోదాలపై పోలీసులు స్పందించారు. డయల్ 100కి డబ్బు పంపిణీపై ఫిర్యాదు అందడంతో విచారణకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. చివరకు ఆయన ఇంట్లో ఎలాంటి నగదు లభించకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. దీంతో, ఎల్బీ నగర్‌లో అర్ధరాత్రి హైడ్రామా క్రియేట్‌ అయ్యింది. 

ఇది కూడా చదవండి: ముగిసిన ఐటీ సోదాలు.. మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో భారీగా నగదు స్వాధీనం

మరిన్ని వార్తలు