చోర్ ... సిబ్బంది షేర్?

17 Dec, 2014 00:29 IST|Sakshi
చోర్ ... సిబ్బంది షేర్?

ఫైనాన్స్ కంపెనీలో భారీ చోరీ
15లక్షల సొత్తు అపహరణ
షట్టర్ పగులగొట్టి..
అసలైనతాళపు చెవితో లాకర్లు తెరిచిన వైనం
ఇంటి దొంగలపైనే అనుమానం
ముగ్గురు బ్యాంకు సిబ్బందిని విచారిస్తున్న పోలీసులు

 
మౌలాలి/గౌతంనగర్: ముఖానికి ముసుగు.. చేతికి గ్లౌజ్‌లు.. సీసీ పుటేజీలకు దొర క్కుండా జాగ్రత్తలు.. జాగిలాలు పసిగట్టకుండా ఉండేలా కారం పొడి చల్లి మాల్కాజిగిరిలోని ‘ఫెడ్‌బ్యాంక్’ (ఫెడరల్ బ్యాంక్ అనుబంధ సంస్థ)లో *15 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు. బ్యాంక్‌లో లాక ర్‌ను ఒరిజనల్ తాళంతో తీయడాన్ని బట్టి ఇది ఇంటి దొంగల పనిగాపోలీసులు భావిస్తున్నారు.  సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని గీతానగర్‌లో బంగారు ఆభరణాలపై రుణాలు ఇచ్చే ఫైనాన్స్ సంస్థ ‘ఫెడ్‌బ్యాంక్’ ఉంది. అక్కడి సిబ్బంది పనులు ముగించుకుని సోమవారం సాయంత్రం ఏడు గంటలకు  బ్యాంకుకు తాళాలు వేసి వెళ్లిపోయారు.

మంగళవారం ఉదయం బ్యాంకు వద్దకు వాచ్‌మన్, అపార్టుమెంట్ వాసులు వచ్చా రు. షట్టర్ పగులగొట్టి ఉండటాన్ని గుర్తించా రు. వారు వెంటనే పోలీసులకు, సంస్థ ఉద్యోగులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు, ఉద్యోగులు, ఫెడరల్ బ్యాంకు అధికారులు, డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం చేరుకున్నాయి. డీసీపీ రమా రాజేశ్వరి దోపిడీ తీరును నిశితంగా పరిశీలించారు. లోపలికి ప్రవేశించిన అగంతకులు ఆభరణాలు దాచి ఉంచిన లాకర్లను మాత్రం అసలైన తాళపు చెవితో తెరిచినట్టు గుర్తించారు.
 
ఇంటి దొంగల పనే...


ఫెడ్‌బ్యాంకు చోరీలో ఇంటి దొంగల పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు లాకర్లను పగులగొట్టే ప్రయత్నం చేయకుండా, తాళం చెవులతోనే తెరిచి చోరీకి పాల్పడడంతో ఇందులో సిబ్బంది పాత్ర ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆధారం దొరకకుండా ఉండేందుకు దుండగులు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖానికి ముసుగు ధరించి, చేతులకు గ్లౌజ్‌లు వేసుకుని చోరీకి పాల్పడినట్టు సీసీటీవీ పుటేజీలో గుర్తించారు. పోలీసులు, జాగిలాలు గుర్తించకుండా ఉండేందుకు, ఆనవాళ్లు లేకుండా చేసేందుకు లాకర్లవద్ద కారంపొడి చల్లడం గమనార్హం.

చోరీకి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముగ్గురు బ్యాంకు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అవసరాల కోసం తనఖా పెట్టిన బంగారు నగలు చోరీకి గురికావడంపై ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఖాతాదారులు ఆందోళన చెందనవసరం లేదని పెడ్ ఫైనాన్స్ యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు బ్యాంకు అధికార ప్రతినిధి ఎన్.కుమార్ పత్రికా ప్రకటన   విడుదల చేశారు.

మరిన్ని వార్తలు