Fed Meeting: వడ్డీరేట్ల పెంపు తప్పదు: ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌

20 Oct, 2023 15:03 IST|Sakshi

ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పకడ్బందీ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు వడ్డీరేట్లు పెంచాల్సిందేనని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సి ఉందని పావెల్ సంకేతాలిచ్చారు. ఇందుకు రానున్న రోజుల్లో వడ్డీరేట్లు పెంచక తప్పదని ప్రకటించారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా ఇంకా ఆందోళనకర స్థాయిలోనే కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం రెండు శాతానికి పడిపోయేంత వరకు వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉందన్నారు. 

ఫెడరల్ రిజర్వ్ గతంలోలాగా వడ్డీరేట్లను పెంచకపోవచ్చనే అభిప్రాయాలు ఉండేవి. కానీ పావెల్‌ తెలిపిన వివరాలతో గ్లోబల్‌ మార్కెట్లు, ఇండియన్‌ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. పెడరల్‌ రిజర్వ్‌ బెంచ్‌మార్క్ రుణ రేటు 22 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టకుండా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమే ఇప్పుడున్న లక్ష్యంగా తెలుస్తుంది. గత సంవత్సరం జూన్‌లో గరిష్ట స్థాయికి చేరిన ప్రధాన ద్రవ్యోల్బణం.. ప్రస్తుతం సగానికి పైగా తగ్గినప్పటికీ, వడ్డీరేట్లు పెంపు ప్రక్రియ దీర్ఘకాలికంగా కొనసాగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గురువారం అమెరికాలో టెక్‌ షేర్లలో వచ్చిన అమ్మకాల వెల్లువ అక్కడి మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. యూఎస్‌లో బాండ్ల రాబడులు మరింత పెరగడం కూడా ప్రతికూలంగా మారింది.

మరిన్ని వార్తలు