గ్రేటర్ ప్రచారానికి తెర

1 Feb, 2016 02:39 IST|Sakshi
గ్రేటర్ ప్రచారానికి తెర

ఆఖరి రోజు నేతల సుడిగాలి పర్యటనలు
ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన పార్టీల ముఖ్య నేతలు
ర్యాలీలు, ప్రదర్శనలు, సభలతో హోరెత్తిపోయిన నగరం

150 డివిజన్లలో 1,333 మంది అభ్యర్థుల పోటీ.. రేపే ఎన్నికలు
 
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. 15 రోజులపాటు హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఆఖరి రోజు కావడంతో అన్ని పార్టీల ముఖ్య నేతలు సుడిగాలి పర్యటనలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. నగరమంతటా ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు హోరెత్తించాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల బాధ్యతను భుజాన వేసుకొని గత నెలరోజులుగా విస్తృతంగా పర్యటనలు, సభల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఆదివారం కూకట్ పల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. బీజేపీ నేత, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాంనగర్, కొత్తపేట, వనస్థలిపురం తదితర చోట్ల జరిగిన సభల్లో పాల్గొన్నారు. నగరాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, కేంద్రం భాగస్వామ్యం లేకుండా తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదని చెప్పారు. మౌలాలీలో చేపట్టిన ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్‌తోనే
 
హైదరాబాద్ నగర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. మల్కాజిగిరిలో టీడీపీ నిర్వహించిన సభలో ఆ పార్టీ నేత రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. 1,200 మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని, ఈ రాష్ట్రం కేసీఆర్ జాగీరు కాదని అన్నారు. కూకట్‌పల్లి, గచ్చిబౌలి, ఆల్విన్ కాలనీ, వివేకానందనగర్ తదితర  ప్రాంతాల్లో రోడ్‌షోలు, బహిరంగ  సభల్లో టీడీపీ నాయకుడు నారా లోకేశ్ పాల్గొన్నారు. అడుగడుగునా ర్యాలీలు, ప్రదర్శనలు దారుస్సలాంలోని పార్టీ కార్యాలయం నుంచి పాతబస్తీలోని వివిధ డివిజన్ల మీదుగా చార్మినార్ వరకు ఎంఐఎం భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. టీఆర్‌ఎస్ బేగంబజార్, గోషామహల్ తదితర చోట్ల ర్యాలీలు నిర్వహించింది. గన్‌ఫౌండ్రీలో బీజేపీ చేపట్టిన ప్రచారంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ పాల్గొన్నారు. అంబర్‌పేట్ నియోజకవర్గం, యాప్రాల్‌లో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. టీఆర్‌ఎస్ మాటల గారడీలకు మోసపోవద్దని ఓటర్లకు చెప్పారు. బేగంపేట్‌లో కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి, మర్రి శశిధర్‌రెడ్డిలు పర్యటించారు. గచ్చిబౌలిలో చేపట్టిన ర్యాలీలో కాంగ్రెస్ నేత మధుయాష్కీగౌడ్ పాల్గొన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో  టీఆర్‌ఎస్ మంత్రి తలసాని ప్రచారం నిర్వహించారు.

గౌలిపురాలో సీపీఐ నిర్వహించిన ర్యాలీలో ఆ పార్టీ నేత నారాయణ పాల్గొన్నారు. ఫిబ్రవరి ఐదో తేదీనే తాను సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు సమాధానమిస్తానన్నారు. అడ్డగుట్టలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చర్లపల్లిలో నిర్వహించిన టీఆర్‌ఎస్ బహిరంగ సభలో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. కొత్తపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పాల్గొన్నారు. మొత్తమ్మీద గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో పోటీకి దిగిన 1,333 మంది అభ్యర్థుల భవిత్యాన్ని తేల్చే ఎన్నికల గడువు సమీపించడంతో ప్రచారానికి ఆఖరి రోజైన ఆదివారాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు అన్ని పార్టీలూ పోటీ పడ్డాయి. మంగళవారం జరిగే పోలింగ్‌లో ఓటరు మహాశయులు ఏ మీట నొక్కుతారోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.

మరిన్ని వార్తలు