చేయి చేయి కలుపుదాం..చెత్తకు టాటా చెబుదాం..

23 Jul, 2014 01:56 IST|Sakshi
చేయి చేయి కలుపుదాం..చెత్తకు టాటా చెబుదాం..

ఖైరతాబాద్: చారిత్రక నేపథ్యమున్న భాగ్యనగరం ఎన్నో అందాలు నెలవు. హైటెక్ సిటీగా గుర్తింపు పొందిని గ్రేటర్‌లో రోజు రోజుకు పేరుకుపోతున్న చెత్తను అరికట్టి క్లీన్ అండ్ గ్రీన్‌గా చేసేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. ఇందుకోసం నగరంలో 36 కిలోమీటర్ల మేర ప్రధాన రోడ్లను గుర్తించి ఆయా రోడ్లలో ‘చెత్త రహిత సమాజం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మంగళవారం జీహెచ్‌ఎంసీ సెంట్రల్ జోన్ పరిధిలోని నెక్లెస్ రోడ్డు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
 
సెంట్రల్ జోన్ కమిషనర్ డాక్టర్ సత్యనారాయణ, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ (శానిటేషన్) రవికిరణ్, డీఎంసీ సోమరాజుతో పాటు నెక్లెస్ రోడ్డులో వ్యాపారాలు చేస్తున్నవారితో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. చెత్తను ఎప్పటికప్పుడు వ్యాపారులు రోడ్లపై పడకుండా బ్యాగుల్లో వేసుకోవాలని, రోజూ మెక్లిన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సిబ్బంది, వాహనాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు ఆ చెత్తను ఆయా వాహనాలలో వేయాలని సూచించారు. మెక్లిన్ సంస్థ ఎండీ ప్రేమానంద్ మాట్లాడుతూ రోజూ షిఫ్ట్‌ల వారీగా వాహనాలు తిరుగుతాయని తెలిపారు. సమావేశంలో సెంట్రల్ జోన్ ఏఎంహెచ్‌ఓలు డాక్టర్ దామోదర్, మనోహర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
 
ముందస్తుగా ఈ ప్రాంతాల్లో అమలు..
మహా నగరానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చెత్త రహిత సమాజ నిర్మాణంలో భాగంగా తొలుత ఏడు ప్రధాన రోడ్లను గుర్తించి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
 
* బంజారాహిల్స్ రోడ్ నెంబర్. 2 నుంచి నాగార్జున సర్కిల్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఎల్‌వీ ప్రసాద్ ఐ హాస్పిటల్  వరకు
* జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మీదుగా పెద్దమ్మ ఆల యం, మాదాపూర్ పోలీస్ స్టేషన్ వరకు
* జూబ్లీహిల్స్ రోడ్ నెం. 92 నుంచి కళింగ ఫంక్షన్ హాల్, సి.వి.ఆర్ న్యూస్ చానెల్ మీదుగా చెక్‌పోస్ట్ వరకు
* బంజారాహిల్స్ రోడ్ నెం. 12 పెన్షన్ ఆఫీస్, ఇన్‌కమ్ టాక్స్ కార్యాలయం మీదుగా కళింగ ఫంక్షన్ హాల్ వరకు
* బంజారాహిల్స్ రోడ్ నెం.1 నుంచి జీవీకే మాల్, జలగం వెంగళరావు పార్కు మీదుగా పెన్షన్ ఆఫీస్ వరకు
* ఖైరతాబాద్ చౌరస్తా నుంచి సోమాజిగూడ, సీఎం క్యాంపు కార్యాలయం, బేగంపేట్ ఫ్లై ఓవర్ వరకు
* బేగంపేట్ మీదుగా గ్రీన్‌ల్యాండ్, ఐమాక్స్, నెక్లెస్ రోడ్డు, అసెంబ్లీ పరిసర ప్రాంతాల ప్రధాన రోడ్లలో అమలు చేస్తున్నారు.
 
అతిక్రమిస్తే జరిమానా
వచ్చే నెల 1న చెత్త రహిత సమాజ నిర్మాణంపై నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అదే రోజు నుంచి అమలులోకి వస్తుంది. ఆ తరువాత షాపులు, తోపుడు బండ్లు.. ఇలా వ్యాపారాలు చేసుకునేవారి షాపుల ముందు చెత్త కనిపిస్తే మొదటి తప్పిదం కింద రూ.500, రెండోసారి రూ.1000, మూడోసారి రూ.3000, నాలుగోసారి రూ.4000, ఐదోసారి రూ. 10 వేల జరిమానా విధిస్తామన్నారు. ఆ తరువాత కూడా అదే తప్పిదం చేస్తే మూడు నెలల జైలు శిక్ష తప్పదు.

మరిన్ని వార్తలు