గోదావరికి కొత్త రూట్..!

19 Jan, 2015 02:51 IST|Sakshi
గోదావరికి కొత్త రూట్..!

సాక్షి,సిటీబ్యూరో: గోదావరి జలాలు  సిటీలో గలగలా పారించేందుకు జలమండలి అధికారులు కొత్త రూట్ సిద్ధం చేస్తున్నారు. జలమండలి ప్రాజెక్టు సమీక్షలో సీఎం చేసిన సూచనల ఆధారంగా కసరత్తు ప్రారంభించారు.  కొత్త రూట్లో పైప్‌లైన్ల ఏర్పాట్లపై సాధ్యాసాధ్యాలను నివేదిక రూపొందించేపనిలో పడ్డారు. విద్యుత్ ఖర్చు తగ్గించడంతో పాటు భూమ్యాకర్షణ శక్తి(గ్రావిటీ)ద్వారానే రాజధాని నగరానికి నీటిని తరలించవచ్చు. పైపులైను మార్గంలోని పలు గ్రామాల్లో నీటి సమస్య తీరనుంది.
 
వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ వరదాయిని గోదావరి మంచినీటి పథకానికి కూడా సరికొత్త మార్గనిర్దేశం చేశారు. ఇటీవల జలమండలి ప్రాజెక్టులపై సుదీర్ఘంగా సమీక్షించిన ఆయన ఈ పథకానికి కొత్త మార్గాన్ని సూచించారు. కేసీఆర్ సూచించారు. సీఎం ఆదేశాలతో జలమండలి అధికారులు ప్రతిపాదనులు రూపొందిస్తున్నారు.
 
కొత్త మార్గం ఇలా..
కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివార్లలోని శామీర్‌పేట్ వరకు రూ.3500 కోట్ల అంచనా వ్యయంతో 186 కి.మీ మార్గంలో గోదావరి మంచినీటి పథకం పైప్‌లైన్ పనులను 2008లో ప్రారంభించిన విషయం విదితమే. ఈ పథకం మొదటి దశ ద్వారా నగరానికి 10 టీఎంసీల నీటిని తరలించాలని లక్ష్యం నిర్దేశించారు. పాత మార్గం ప్రకారం కరీంనగర్ జిల్లాలోని ఎల్లంపల్లి-బొమ్మకల్-మల్లారం నీటిశుద్ధికేంద్రం-కొండపాక-ఘన్‌పూర్-శామీర్‌పేట్(నగర శివారు) మార్గంలో ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

సీఎం సూచనల ప్రకారం కొత్త మార్గంలో బొమ్మకల్‌రిజర్వాయర్‌ను మినహాయించి ఎల్లంపల్లి(126 మీటర్ల ఎత్తున్న కాంటూరు)నుంచి కరీంనగర్ జిల్లాలోని ధర్మారం జగిత్యాల మార్గంలో ఎత్తై కొండ ప్రాంతం ఎండపల్లి(480మీటర్ల ఎత్తు)కి నీటిని పంపింగ్ చేసి అక్కడి నుంచి భూమ్యాకర్షణ శక్తి(గ్రావిటీ) ఆధారంగా 10 టీఎంసీల నీటిని మల్లారం నీటి శుద్ధి కేంద్రానికి తరలించాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. దీంతో ఆయన ఆదేశాలతో కొత్త మార్గం సాధ్యాసాధ్యాలపై జలమండలి అధికారులు  కసరత్తు చేస్తున్నారు.

గోదావరి పథకం తొలిదశను ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర సర్కారు లక్ష్యం నిర్దేశంచడంతో గోదావరి పథకం రెండోదశలో భాగంగా  ఈ కొత్త మార్గం గుండా నీటిని తరలించాలా ? లేదా తొలిదశలోనే ఈ మార్గం గుండా నగరానికి నీటిని తరలించాలా ? అన్న అంశంపై అధికారులు పరిశీలనచేయనున్నారు. క్షేత్రస్థాయి పర్యటన తరవాత కొత్త మార్గంపై సీఎంకు నివేదిస్తామని అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం తాము క్షేత్రస్థాయి పరిశీలన మాత్రమే జరుపుతున్నామని స్పష్టంచేశారు. నూతన మార్గంలో నేల వాలును తెలిపే కాంటూరు మ్యాపులను అధ్యయనం చేసిన తరవాతనే కొత్త మార్గంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
 
తీరనున్న  పలు గ్రామాల దాహార్తి..
సీఎం సూచనల ప్రకారం గోదావరి ప్రస్తుత మార్గాన్ని స్వల్పంగా మార్చిన పక్షంలో పైప్‌లైన్‌కు ఆనుకొని ఉన్న కరీంనగర్,మెదక్ జిల్లాలకు చెందిన పలు గ్రామాల దాహార్తి తీరనుందని, అక్కడి జిల్లా గ్రిడ్‌లకు ఈ మార్గం దాహార్తిని తీర్చే వరదాయినిగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త మార్గం గుండా పైప్‌లైన్‌లు వేస్తే నీటి పంపింగ్‌కు అయ్యే  విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు