అనుసంధానం అడుగు పడేదెలా?

16 Oct, 2023 06:38 IST|Sakshi

కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకు గోదావరి ట్రిబ్యునల్‌ అనుమతి

కృష్ణా జలాల్లో ఎగువ రాష్ట్రాలకు అదనంగా నీరు కేటాయింపు

మహారాష్ట్రకు 14, కర్ణాటకకు 21, ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు అదనపు నీరు

45 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యత బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కు

అన్ని నదుల అనుసంధానంలో అదనపు కేటాయింపుల కోసం ఎగువ రాష్ట్రాల పట్టు

సవాల్‌గా మారిన ఏకాభిప్రాయ సాధన

సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానానికి ట్రిబ్యునళ్ల అవార్డులే ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఒక నదిలో మిగులు జలాలను లభ్యత తక్కువగా ఉన్న మరో నదికి మళ్లించడానికి.. ఆ నదీ పరివాహక ప్రాంతం (బేసిన్‌)లో ఎగువన ఉన్న రాష్ట్రాలు అదనంగా నీటిని కేటాయించాలంటూ పట్టుబడుతున్నాయి.

ఇందుకు గోదా­వరి, మహానది ట్రిబ్యునళ్ల అవార్డులను అస్త్రాలుగా చేసుకుంటున్నాయి.దీంతో నదుల అనుసంధానం సాధ్యం కావడంలేదు. ఇది సాకారం కావాలంటే న్యాయపరంగా అడ్డంకులను తొలగించుకోవడంతోపాటు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించాలి. ఇదే పెద్ద సవాల్‌.

గోదావరి నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల మళ్లింపునకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన గోదావరి ట్రిబ్యునల్‌.. ఇందుకు బదులుగా కృష్ణా బేసిన్‌లో ఎగువన ఉన్న మహారాష్ట్రకు 14, కర్ణాటకకు 21, సాగర్‌ ఎగువన ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీల కృష్ణా జలాలను అదనంగా వాడుకొనే వెసులుబాటు కల్పించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలన ఉత్త­ర్వు­లు జారీ చేసినప్పటి నుంచే కృష్ణా బేసిన్‌లో అద­నపు నీటిని వాడుకునే అవకాశం కల్పించింది. ఈ నీటి వాడకానికి మహారాష్ట్ర, కర్ణాటక తొమ్మిదేళ్ల క్రి­తమే కసరత్తు ప్రారంభించాయి.

ఉమ్మడి ఏపీకి కేటా­యించిన 45 టీఎంసీలను విభజనానంతరం రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను ఇటీవల బ్రిజేష్‌­కుమార్‌ ట్రిబ్యునల్‌కు కేంద్రం అప్పగించింది. గోదావరి – కావేరి అనుసంధానం తొలి దశలో 141 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూ­డీఏ) ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనను ప్రాధాన్యతగా చేపట్టాలని కేంద్రం ఆదేశించింది.

అయితే, కృష్ణా నది మీదుగా ఈ అనుసంధానం చేపడుతున్నందున, కృష్ణా జలాల్లో తమకు అదనంగా కేటాయింపులు చేయాలని మహారాష్ట్ర, కర్ణాటక పట్టుబడుతున్నాయి. కావేరి బేసిన్‌కు గోదావరి జలాలను మళ్లిస్తున్న నేపథ్యంలో కావేరి జలాల్లో అదనపు కోటా ఇవ్వాలంటూ కర్ణాటక, కేరళ పట్టుబ­డు­తున్నాయి. దీన్ని కృష్ణా, కావేరి బేసిన్‌లో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళ­నాడు వ్యతిరేకిస్తున్నాయి. దాంతో గోదావరి– కావేరి అనుసంధానంపై ఏకాభిప్రాయ సాధన సవా­ల్‌గా మారింది. ఇదొక్కటే కాదు.. ద్వీపకల్ప భారత­దేశంలో ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించిన 15 అనుసంధానాలపై ఏకాభిప్రాయ సాధన సాధ్యమయ్యే అవకాశమే లేదని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు