మాకు సరిపోగా మిగిలింది మీకు

5 Jan, 2018 02:24 IST|Sakshi

తుంగభద్ర జలాలపై కర్ణాటక మంత్రుల బృందంతో మంత్రి హరీశ్‌

ఆర్డీఎస్‌ ఆధునీకరణకు సహకరిస్తాం: కర్ణాటక ఇరిగేషన్‌ మంత్రి పాటిల్‌

సాక్షి, హైదరాబాద్‌
తుంగభద్ర నదీ జలాల్లో తెలంగాణ సాగు అవసరాలకు పోగా మిగిలిన జలాలను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు కర్ణాటక మంత్రుల బృందానికి స్పష్టం చేశారు. అలంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని 7 వేల ఎకరాల ఆరుతడి పంటలకు అవసరమైన సాగునీటి వాడకంపై ఉభయ రాష్ట్రాల ఇంజనీర్లు అంచనా వేశాక నీటిని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు కర్ణాటక నీటిపారుదలశాఖ మంత్రి ఎంబీ పాటిల్‌ నేతృత్వంలోని బృందం గురువారం ఇక్కడి జలసౌధలో హరీశ్‌రావుతో సమావేశమైంది. తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో ఈ ఏడాది నీటి కొరత తీవ్రంగా ఉన్నందున తమ రాష్ట్రంలో తుంగభద్ర ఆయకట్టును కాపాడుకోవడానికి, తాగునీటి అవసరాలకు ఆర్డీఎస్‌లో తెలంగాణకు కేటాయించిన నీటిని వాడుకునేందుకు అనుమతించాలని ఎంబీ పాటిల్‌ మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రం సమర్పించారు.

ఆర్డీఎస్‌ ఆయకట్టుకు అవసరమయ్యే నీటి వినియోగం, కర్ణాటక నీటి వాడకానికి అనుమతిపై ఇరు రాష్ట్రాల మంత్రులు చర్చించారు. తుంగభద్ర డ్యాం నుంచి తెలంగాణకు 3.5 టీఎంసీల నీటి వాటా ఉందని, ప్రాజెక్టు కింద 7 వేల ఎకరాల ఆరుతడి పంటలకు అవసరమైన సాగునీటి వాడకంపై రెండు రాష్ట్రాల ఇంజనీర్లు అంచనా వేశాక మిగిలిన నీటిని కర్ణాటక వాడుకునే అంశాన్ని పరిశీలిస్తామని హరీశ్‌రావు కర్ణాటక మంత్రులకు తేల్చి చెప్పారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించాక నిర్ణయం చెబుతామన్నారు. తుంగభద్ర నీటిని వాడుకున్న దానికి బదులుగా వచ్చే వేసవిలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు కోరినా నారాయణపూర్‌ డ్యామ్‌ నుంచి జూరాలకు 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని కర్ణాటక మంత్రులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గతేడాది కూడా మహబూబ్‌నగర్‌ జిల్లా తాగునీటి అవసరాల కోసం తాము నారాయణ్‌పూర్‌ నుంచి ఒక టీఎంసీ నీటిని జూరాలకు తెలంగాణ ప్రభుత్వం కోరిక మేరకు విడుదల చేసిన విషయాన్ని కర్ణాటక మంత్రులు గుర్తుచేశారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో తెలంగాణ స్నేహ సంబంధాలు కొనసాగిస్తోందని, కర్ణాటక ప్రభుత్వం గతేడాది ఒక టీఎంసీ నీటిని తెలంగాణకు విడుదల చేసిందని, ఇప్పుడు మళ్లీ అదే రకమైన స్ఫూర్తిని చాటుతోందని మంత్రి హరీశ్‌ కితాబిచ్చారు.

ఆర్డీఎస్‌పై త్వరలో మూడు రాష్ట్రాల భేటీ...
ఆర్డీఎస్‌ ఆధునీకరణ పనులపై ఆంధ్రప్రదేశ్‌తో కలసి త్వరలో ఉమ్మడి సమావేశం నిర్వహించాలని తెలంగాణ, కర్ణాటక మంత్రులు నిర్ణయించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గద్వాల ప్రాంత రైతాంగానికి 87 వేల ఎకరాలకు ఆర్డీఎస్‌ నుంచి నీరందాల్సి ఉన్నా ప్రస్తుతం 20 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందట్లేదని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఉమ్మడి ఏపీలో ఆధునీకరణ పనులు మొదలుపెట్టినా ఇప్పటికీ పూర్తి కాలేదని, ఆరు నెలల వర్కింగ్‌ సీజన్‌లో పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉందన్నారు. అయితే ఏపీ సహకారం లేకుండా పనులు పూర్తి కావని కర్ణాటక మంత్రి పాటిల్‌ అభిప్రాయపడ్డారు. అందువల్ల ఈ అంశంపై త్రైపాక్షిక సమావేశానికి తెలంగాణ చొరవ చూపాలన్నారు. ఈ ప్రతిపాదనకు హరీశ్‌రావు అంగీకరించారు. ఏపీ ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో బుధవారమే తాను మాట్లాడానని, ఇరు రాష్ట్రాలు ఉమ్మడి ఇండెంట్‌ను తుంగభద్ర బోర్డుకు పంపించడానికి అంగీకారం కుదిరిందన్నారు. త్రైపాక్షిక సమావేశానికి కూడా దేవినేనితో మాట్లాడతానని హరీశ్‌ హామీ ఇచ్చారు. సమావేశంలో కర్ణాటక మంత్రులు తన్వీర్‌సైత్, సంతోష్‌ లాడ్, ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు శివరాజ్‌ తంగడగి, అంపుల గౌడ, ప్రతాప్‌ గౌడ, అంపయ్య నాయక్, ఎమ్మెల్సీలు కేసీ కొండయ్య, బోస్‌రాజు, అలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు