రెండో రోజు కూడా వారికి నిద్ర కరువు

22 Sep, 2016 19:08 IST|Sakshi
తెలంగాణలో మరో ఐదురోజులు భారీ వర్షాలు

హైదరాబాద్ : తెలంగాణలో మరో అయిదు రోజులు భారీ వర్షాలు కురియనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో నగరంతో పాటు తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాగా ఇప్పటికే కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. నగరంలో ఇంకా పలు ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. మరోసారి భారీ వర్ష సూచనతో ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు.

రెండో రోజు కూడా వారికి నిద్ర కరువు

నిజాంపేటలోని తుర్క చెరువు ఉగ్రరూపం దాల్చడంతో చెరువు కింద ఉన్న బండారి లేఅవుట్ కాలనీలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. భయంతో నిద్రలేకుండా రెండో రోజు కూడా సహాయం కోసం వేచిచూస్తున్నారు. తుర్క చెరువు చిన్న తూము తెరవడంతో కాలనీలోకి నీరు చేరడంతో పాటు కాలనీలో నుంచి నీరు బయటికి వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో నీరు కాలనీలోనే సెల్లార్‌ల నిండా ఉంది. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు సెల్లార్‌లలో నీరు మోటార్‌లద్వారా బయటికి పంపించేందుకు తీవ్ర యత్నం చేస్తున్నప్పటికీ తూము నీరు ప్రవాహం తగ్గకపోవడంతో నీరు తగ్గడంలేదు.

దీంతో ఇళ్ళల్లో ఉన్న వృద్దులు, పిల్లలు బయటికి రాలేని పరిస్థితి దాపురించింది. రెండు రోజులుగా విద్యుత్ సరఫరా లేదు. మంచినీటిసరఫరా లేదు. పాలు, ఆహార పదార్ధాల కోసం రోడ్లపై ఉన్న నీటిలోనుంచి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా ప్రజలు తమ బాధను వచ్చిన ప్రతి ప్రజాప్రతినిధికి, అధికారికి విన్నవించిన సమస్యకు పరిష్కారం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు నిజాంపేట బండారి లేఅవుట్‌లో నీట మునిగిన అపార్ట్‌మెంట్లను మంత్రి కేటీఆర్ ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా తమ కాలనీకి శాశ్వత పరిష్కారం చూపించాలని మంత్రికి మహిళలు పెద్దపెట్టున మొరపెట్టుకున్నారు. కొంతమంది కాలనీ వాసులు లే అవుట్‌కు విరుద్దంగా నిర్మాణాలు వెలిశాయని కూడా ఫిర్యాదు చేశారు. దాదాపు మూడు గంటల పాటు మంత్రి వెంట మహిళలు తమ బాధలను వివరించారు. ఇలాంటి ప్రకృతి వైఫరీత్యాలు ఏర్పడినపుడు ప్రభుత్వం చేసే సహాయ కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు