ధిక్కార పిటిషన్ వేస్తే దారిలోకి వస్తారు

22 Jul, 2016 03:36 IST|Sakshi
ధిక్కార పిటిషన్ వేస్తే దారిలోకి వస్తారు

- ఆదేశాలు అమలు చేయకపోతే.. ధిక్కారంగా పరిగణన
- కేంద్రంపై హైకోర్టు సీరియస్

 
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిధులు కేటాయింపు విషయంలో మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఏడాది క్రితం ఆదేశాలిచ్చినా.. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటికైనా తగిన నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో కేంద్రం చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఇప్పటికే తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం పూర్తి చేయవచ్చినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయని, కేంద్రం నిధులిస్తే హైకోర్టు నిర్మాణాన్ని కూడా ప్రారంభించే అవకాశాలు ఉంటాయని కోర్టు పేర్కొంది. నిధుల విషయంలో మా (కోర్టు) ఆదేశాలను మీరు (కేంద్రం) అమలు చేయకపోవడంపై ఎవరూ ధిక్కార పిటిషన్ దాఖలు చేయలేదు.
 
 దాఖలు చేస్తే మీరే దార్లోకి వస్తారు.. అంటూ ఒకింత ఘాటుగా వ్యాఖ్యానించింది. హైకోర్టు విభజనపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాల్సిందేనని, ఏవేవో కారణాలు చెప్పి ఈ బాధ్యత నుంచి తప్పించుకోజాలరని తేల్చి చెప్పింది. హైకోర్టు విభజన విషయంలో రాష్ట్రపతి అధికారాలను నియంత్రించేలా గత ఏడాది ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్లపై గురువారం వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
 
 పునఃసమీక్ష అభ్యర్థనలతో వ్యాజ్యాలు...
 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే ఉండాలని గతేడాది మే నెలలో ధర్మాసనం తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పులో కొన్ని తప్పిదాలు చోటు చేసుకున్నాయని, ఏపీ హైకోర్టు ఏర్పాటు స్థలాన్ని నోటిఫై చేసే విషయంలో రాష్ట్రపతికి ఉన్న అధికారాలపై నియంత్రణ విధించేలా భాష్యం చెబుతూ ధర్మాసనం తీర్పునిచ్చిందని, కాబట్టి ఆ తీర్పును పునఃసమీక్షించాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది రవీందర్‌రెడ్డి వేర్వేరుగా అనుబంధ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై పలుమార్లు విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరఫున ఆ రాష్ట్ర ఏజీ కె.రామకృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, ఏపీ సర్కార్ తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) కె.ఎం.నటరాజ్ తదితరులు వాదనలు వినిపించారు.
 
 రాష్ట్ర భూభాగంలోనే హైకోర్టు..: ఏపీ ఏజీ
  దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, హైకోర్టు అనేది రాష్ట్ర భూభాగంలోనే ఉండాలని రాజ్యాంగం చెబుతోందని వివరించారు. ఏపీ హైకోర్టును ఏపీ భూభాగంపైనే నిర్మించుకోవాలన్న ఉద్దేశాన్ని పునర్విభజన చట్ట నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని, అందువల్ల దాన్ని పునః సమీక్షించాల్సిన అవసరం లేదన్నారు. ఆ తరువాత ఏఎస్‌జీ నటరాజ్ వాదనలు వినిపిస్తూ, గతేడాది ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాల్సిందేనన్నారు. ఏపీ హైకోర్టు ఎక్కడ ఉండాలన్న దానిపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రపతికి ఉందని, అయితే ఆ అధికారాన్ని ఆయన ఉపయోగించక ముందే హైకోర్టు జోక్యం చేసుకుందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, అసలు ఇంతకీ హైకోర్టు విభజన విషయంలో మీ వైఖరి ఏమిటని, హైకోర్టు నిర్మాణానికి ఎన్ని నిధులిచ్చారని ధర్మాసనం నటరాజ్‌ను ప్రశ్నించింది.

మరిన్ని వార్తలు