దర్యాప్తు తీరుపై సంతృప్తిగా లేము

22 Dec, 2015 03:13 IST|Sakshi
దర్యాప్తు తీరుపై సంతృప్తిగా లేము

♦ ఏపీ సర్కార్‌కు హైకోర్టు స్పష్టీకరణ
♦ దర్యాప్తు అధికారిని మార్చండి లేకపోతే మేమే ఆదేశాలిస్తాం
♦ ఇప్పటివరకు ఒక్క అరెస్ట్ కూడా ఎందుకు జరగలేదు?
 
 సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ డిపాజిట్ల కుంభకోణం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దర్యాప్తు తీరుపై తాము ఎంత మాత్రం సంతృప్తికరంగా లేమని ఉమ్మడి హైకోర్టు తేల్చి చెప్పింది. వెంటనే దర్యాప్తు అధికారిని మార్చాలని, లేని పక్షంలో తామే అందుకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టంచేసింది. అలాగే ఆస్తులను విక్రయించబోమని కోర్టుకు హామీ ఇచ్చి, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటే అది కోర్టును మోసం చేయడమేనని, దానిని తాము తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని అగ్రిగోల్డ్ యాజమాన్యానికి స్పష్టం చేసింది. ఇందుకు పరిణామాలు కూడా తీవ్రంగా ఉం టాయని హెచ్చరించింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సామాన్య ప్రజల నుంచి అగ్రిగోల్డ్ యాజమాన్యం రూ.6,350 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేసి చేతులెత్తేసిందని, ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అగ్రిగోల్డ్ డిపాజిట్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేష్‌బాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది. హైకోర్టు ఏర్పాటు చేసిన వేలం పర్యవేక్షణ కమిటీ తరఫు న్యాయవాది రవిప్రసాద్ స్పందిస్తూ, వేలం నిర్వహణకు మూడు సంస్థలను ఎంపిక చేశామని, వాటికి ఎలా ఆస్తులను పంపిణీ చేయాలన్న దానిపై కమిటీ కసరత్తు చేస్తోందని చెప్పారు.

 అధికారులు తప్పించుకుంటున్నారు...
 తరువాత ధర్మాసనం, ఈ కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పి.కృష్ణప్రకాశ్‌ను ప్రశ్నించింది. ‘అసలు మీరు దర్యాప్తు చేస్తున్నారా..? ఇంత పెద్ద కుంభకోణంలో ఇప్పటివరకు ఒక్కరి అరెస్ట్ కూడా జరగలేదు. కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం లేదని మీరు భావిస్తున్నారు.? ఒకవేళ భావిస్తుంటే, ఆ విషయాన్నే రాతపూర్వకంగా కోర్టుకు చెప్పండి. దర్యాప్తు తీరుపై మేం ఎంత మాత్రం సంతృప్తికరంగా లేం. దర్యాప్తు అధికారి తీరుపై మాకు తీవ్ర అభ్యంతరాలున్నాయి. అధికారులు కావాలనే ఈ కేసులో దర్యాప్తు చేయకుండా తప్పిం చుకుంటున్నారు. బాధితుల నుంచి రోజూ మేం అనేక లేఖలు అందుకుంటున్నాం.

వాటి ద్వారా అనేక కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. గత నెలన్నర కాలంలో ఎంత మంది నిందితులను ప్రశ్నించారు? ఎన్నిసార్లు ప్రశ్నించారు? ఏ ఏ విషయాలపై దర్యాప్తు చేశారు? పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయండి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రకాశం జిల్లా, టంగుటూరులోని పవర్‌ప్లాంట్‌లో ఉన్న యంత్ర సామాగ్రిని అగ్రిగోల్డ్ యాజమాన్యం విక్రయిస్తోందని, తరువాత పవర్‌ప్లాంట్ స్థలాన్ని కూడా అమ్మేందుకు రంగం సిద్ధం చేస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలను సమర్పించారు.

మరిన్ని వార్తలు