‘గౌరవ’మేదీ...?

11 Aug, 2015 01:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక ప్రజా ప్రతినిధులకు గౌరవాన్ని ఇనుమడింపజేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీ గాల్లో కలసిపోతోంది. అట్టహాసంగా గౌరవ వేతనాల పెంపును ప్రకటించినా.. ఇప్పటివరకూ అమల్లోకి రాలేదు. ఈ పెంపును ఏప్రిల్ 1 నుంచే వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన చేసి ఐదు నెలలు గడిచినా... రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క సర్పంచ్‌కు గానీ, ఎంపీటీసీకి గానీ పెంచిన గౌరవ వేతనం అందలేదు.
 
జూన్‌లో ఉత్తర్వులొచ్చినా..: ప్రభుత్వం ప్రకటించిన విధంగా గౌరవ వేతనాలను పెంచకపోవడంతో జూన్‌లో సర్పంచులు, ఎంపీటీసీల సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ ఆందోళనకు ప్రజాసంఘాలు కూడా మద్దతు పలకడంతో దిగివచ్చిన సర్కారు... హడావుడిగా వేతనాల పెంపునకు సంబంధించి జీవో నంబరు 53 (జూన్ 24న)ను జారీచేసింది. ఇది వచ్చి నెలన్నర దాటినా... పెరిగిన వేతనం జమ కాలేదని సర్పంచులు, ఎంపీటీసీలు చెబుతున్నారు. హామీని నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైనందున మరోమారు పోరాటానికి సిద్ధమవుతున్నట్లు సర్పంచుల సంఘాలు ప్రకటించాయి. అయితే గౌరవ వేతనాల పెంపునకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ పంపిన ఫైలుకు ఆర్థికశాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లు తెలిసింది.

చెక్‌పవర్ అనిశ్చితి..: గ్రామాల్లో అభివృద్ధి నిధుల వినియోగానికి సంబంధించి సర్పంచ్‌తోపాటు గ్రామ కార్యదర్శికి ఉమ్మడిగా అధికారమిచ్చే జాయింట్ చెక్‌పవర్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటన అమలుకు నోచుకోలేదు. దీనిపై జూన్ నెలాఖరులోగా ఉత్తర్వులు జారీ చేస్తామన్న ప్రభుత్వ పెద్దలు తర్వాత ఆ ఊసే మరిచారు. దీంతో జాయింట్ చెక్‌పవర్‌తో పంచాయతీల్లో కార్యదర్శులే పైచేయిగా మారిందని, ప్రజాప్రతినిధులకు వీసమెత్తు విలువ లేకుండా పోయిందని సర్పంచులు వాపోతున్నారు.  
 
ఏకగ్రీవ పంచాయతీ సం‘గతేంటి’?: ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు నగదు పురస్కారాలను అందిస్తామని 2013లో ఎన్నికలప్పుడు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకున్న మేజర్ గ్రామ పంచాయతీకి రూ.10లక్షలు, మైనర్ గ్రామ పంచాయతీకి రూ.5లక్షలు ఇస్తామని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 600 పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. వీటికి సంబంధించి రూ.54కోట్ల సర్కారు అందజేయాల్సి ఉంది. కానీ ఎన్నికలై రెండేళ్లవుతున్నా ‘ఏకగ్రీవ’ పంచాయతీలకు నగదు పురస్కారాలు అందలేదు. రూ.2.20కోట్లను మాత్రం విడుదల చేశారు.

మరిన్ని వార్తలు