డ్రగ్స్‌ కేసు: కీలక సూత్రధారి విచారణ

7 Aug, 2017 11:31 IST|Sakshi
డ్రగ్స్‌ కేసు: కీలక సూత్రధారి విచారణ

హైదరాబాద్‌: విదేశాల నుంచి డ్రగ్స్‌ తెప్పించి సరఫరా చేసినట్లుగా ఆరోపణలున్న నెదర్లాండ్స్‌ ఐటీ నిపుణుడు మైక్‌ కమింగను శేరిలింగంపల్లి పోలీసులు మూడు రోజుల పాటు విచారించారు. మూడు రోజుల కస్టడీలో అతడి నుంచి పలు కీలక వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది. అతడి ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్‌లోని డేటా ఆధారంగా విచారణ సాగినట్టు సమాచారం.

పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు సలహాదారుగా ఉన్న కమింగ ఉద్యోగులకు డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ డ్రగ్స్‌ మాఫియాతో అతడికి లింకులున్నట్టు.. గోవా, ముంబై నుంచి హైదరాబాద్‌కు మత్తు పదార్థాలు సరఫరా చేసినట్టు విచారణలో వైల్లడైందని సమాచారం. తాను డ్రగ్స్‌ వాడుతున్నట్టు పోలీసులతో చెప్పినట్టు తెలిసింది. కమింగ దగ్గర వందల మంది డ్రగ్స్‌ వినియోగదారుల లిస్ట్‌ ఉన్నట్టు సిట్‌ గుర్తించారు.

సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాలర్‌ నిపుణుడిగా పేరు పొందిన అతడు హైదరాబాద్‌ యువతిని పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిర నివాసం ఏర్పచుకున్నాడు. ఇంటి నుంచే అతడు డ్రగ్స్‌ దందా సాగిస్తున్నట్టు సమాచారం. మూడు రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు అతడిని సోమవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు.