కొత్తగా అల్పపీడనం.. మరో ఐదురోజులు వర్షాలు!

24 Sep, 2016 08:23 IST|Sakshi
కొత్తగా అల్పపీడనం.. మరో ఐదురోజులు వర్షాలు!

జంటనగరాలను వర్షాలు వీడనంటున్నాయి. ఇప్పటికే నాలుగు రోజులుగా సిటీ మొత్తం కుంభవృష్టి కురుస్తుంటే.. అది చాలదన్నట్లు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షాలు పడతాయట. వర్షాల కథ ఇంకా ముగిసిపోలేదని, దాదాపు ఇదే స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ వైకే రెడ్డి చెప్పారు. మధ్యలో ఒక్కరోజు పగటిపూట కాస్త తెరిపి ఇవ్వడంతో ప్రజలు ఒక్కసారిగా బయటకు వచ్చి, తమకు కావల్సిన కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుక్కోగలిగారు. కొంచెం వెలుగు ముఖం చూశామని సంబరపడ్డారు. అయితే ఆ సంబరం ఎంతోసేపు నిలవలేదు. మళ్లీ రాత్రి నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మరోసారి నగరంలో భారీ వర్షాలు తప్పకపోవచ్చని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా చెబుతోంది. వాయవ్య భారతం నుంచి కొత్తగా వస్తున్న పరిస్థితుల వల్ల విదర్భ, తెలంగాణలపై బలమైన అల్పపీడనం ఏర్పడిందని సంస్థ ప్రతినిధులు చెప్పారు. గత నాలుగు రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షపాతం నమోదు కావడంతో పరిస్థితి ఇప్పటికీ అదుపులోకి రాలేదు. లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. దీంతో మరోసారి వర్షాలంటే నగరవాసులు ఉలిక్కిపడుతున్నారు.

మరిన్ని వార్తలు