‘బీకాం’దే హవా!

18 Nov, 2023 04:35 IST|Sakshi

రాష్ట్రంలో ముగిసిన డిగ్రీ ప్రవేశాలు 

2 లక్షల సీట్ల భర్తీ.. మిగిలిన సీట్లు 1.84 లక్షలపైనే.. 

బీకాం తర్వాత లైఫ్‌ సైన్స్‌కు పెరిగిన ఆదరణ 

తక్షణ ఉపాధి కోర్సుల వైపు విద్యార్థుల మొగ్గు 

దోస్త్‌ ప్రవేశాల డేటా విడుదల చేసిన మండలి 

సాక్షి, హైదరాబాద్‌:  డిగ్రీలో తక్షణ ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులకే విద్యార్థులు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యంగా బీకాంతోపాటు బీఎస్సీ లైఫ్‌సైన్స్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. ఉన్నత విద్యా మండలి శుక్రవారం విడుదల చేసిన 2023 దోస్త్‌ డేటా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సంప్రదాయ డిగ్రీ కోర్సుల కన్నా.. ఆధునిక హంగులున్న విభాగాల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరారు.

ఒకేషనల్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు నామమాత్రంగా ఉన్నాయి. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సులకు డిమాండ్‌ ఎక్కువగా ఉన్నా.. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల వైపు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బీఏ వంటి కోర్సుల్లో మార్పులు తెచ్చినా, ఆనర్స్‌ వంటివి అందుబాటులోకి తెచ్చినా విద్యార్థులు వాటికి పెద్దగా మొగ్గు చూపలేదు. 

1.84 లక్షల సీట్లు ఖాళీ..: 2023–24 విద్యా సంవత్సరంలో డిగ్రీలో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి పలు దఫాలుగా ‘డిగ్రీ ఆన్‌లైన్‌ సరీ్వసెస్, తెలంగాణ (దోస్త్‌)’అడ్మిషన్ల ప్రక్రియను ముగించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,89,049 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉండగా.. అందులో 2,04,674 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగతా 1,84,375 సీట్లు మిగిలిపోయాయి. 

బీకాం వైపే చూపు: రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీలోని 11 ప్రధాన కోర్సుల్లో 2,04,674 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. వీరిలో అత్యధికంగా 85,153 మంది బీకాం కోర్సునే ఎంచుకున్నారు. ఆ తర్వాత బీఎస్సీ లైఫ్‌ సైన్స్‌లో 43,180 మంది చేరారు. తర్వా తి స్థానంలో బీఏ కోర్సు ఉంది. ఇందులో 29,752 మంది చేరారు. బీఎస్సీ ఫిజికల్‌ సైన్స్‌కు కూడా డిమాండ్‌ పెరుగుతోంది. దీనిలో 25,937 మంది చేరారు. కరోనా తర్వాత ఈ–కామర్స్‌ జోరు పెరిగింది.

అకౌంటింగ్, కంప్యూటర్‌ పరిజ్ఞానంతో కూడిన కోర్సులు చేసినవారికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఆడిట్‌ విభాగాల్లోనూ ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో కామర్స్‌ నేప థ్యం ఉన్న వారికి డిమాండ్‌ వచ్చింది. డిగ్రీ పూర్తవగానే మంచి వేతనంతో ఉద్యోగం వస్తోందన్న భరోసా కనిపిస్తోంది. మరోవైపు సాధారణ డిగ్రీలోనే బొటనీ, జువాలజీ, మైక్రో బయాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ వంటి సబ్జెక్టులను చేర్చి కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంతో వాటికీ డిమాండ్‌ వస్తోంది. 

డిమాండ్‌ ఉన్న కోర్సులు కోరుకుంటున్నారు 
విద్యార్థులు పదేళ్లుగా మార్కెట్లో డిమాండ్‌ ఉన్న కోర్సులను ఎంచుకుంటున్నారు. మార్కెటింగ్‌ పెరగడం, ఈ–కామర్స్‌లో మంచి అవకాశాలు లభించడంతో బీకాంకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ కోర్సు రాష్ట్రవ్యాప్తంగానూ మంచి నాణ్యతను చూపుతోంది. లైఫ్‌ సైన్స్‌ కోర్సులకు అన్నిచోట్లా ఆదరణ లభిస్తోంది. దీంతోపాటు బీఏ ఆనర్స్‌ కోర్సులను విద్యార్థులు ఇష్టపడుతున్నారు. ఏదేమైనా డిగ్రీలో ప్రమాణాలు పెంచే దిశగా మండలి ప్రయత్నించడం కూడా ప్రవేశాలు పెరగడానికి దోహదపడుతోంది. – ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి,ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ 

మరిన్ని వార్తలు