ఏపీకు 10, తెలంగాణకు 20 టీఎంసీలు

16 Dec, 2015 17:53 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు 10, తెలంగాణకు 20 టీఎంసీల నీరు వినియోగించుకోవాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆదేశించింది. బుధవారం హైదరాబాద్లో జరిగిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశంలో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కృష్ణానదిలో మొత్తం 30 టీఎంసీల లభ్యత కలిగి ఉండగా అందులో ఏపీకి 10, తెలంగాణకు 20 టీఎంసీల నీరు కేటాయించారు. ప్రస్తుతం కృష్ణా డెల్టా అవసరాల దృష్ట్యా ఏపీకి 10 టీఎంసీల నుంచి 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని బోర్డు నిర్ణయించింది.

కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావడంపై ఈ సమావేశంలో చర్చించారు. శ్రీశైలం డ్యామ్ భద్రతపై కేంద్ర జల మండలికి లేఖ రాయడంతో పాటు డ్యామ్ సేఫ్టీకి చర్యలు తీసుకోవాలని బోర్డు తీర్మానించింది. తదుపరి సమావేశాన్ని విజయవాడలో జరపాలని... ఆ సమావేశంలో ప్రాజెక్టులపై చర్చించేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకారం తెలిపారు.  

మరిన్ని వార్తలు