రెండు లక్షల కొలువులిస్తాం

17 Nov, 2023 05:07 IST|Sakshi
గురువారం మేడ్చల్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌కు హాజరైన ప్రజలు

కాంగ్రెస్‌ సర్కారు రాగానే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ: రేవంత్‌రెడ్డి 

సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డి ఇద్దరూ తోడు దొంగలు 

మేడ్చల్‌ కార్నర్‌ మీటింగ్‌లలో ప్రసంగించిన టీపీసీసీ అధ్యక్షుడు 

జవహర్‌నగర్, మేడ్చల్‌ రూరల్‌:  రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెసేనని, తమ ప్రభుత్వం ఏర్పాటుకాగానే రెండు లక్షల కొలువులను భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ వస్తే ఆగమవుతుందని కేసీఆర్, కేటీఆర్‌ ప్రచారం చేస్తున్నారని.. బీఆర్‌ఎస్‌ పాలనలోనే తెలంగాణ ఆగమైందని మండిపడ్డారు.

మంత్రి మల్లారెడ్డి మేడ్చల్‌ను అభివృద్ధి చేయకపోగా కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గురువారం మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్, మేడ్చల్‌ పరిధిలో కాంగ్రెస్‌ అభ్యర్ధి తోటకూర వజ్రేశ్‌ (జంగయ్య) యాదవ్‌ను గెలిపించాలంటూ కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్‌కు, మంత్రులకు ఆస్తులున్న కోకాపేట వైపు ఐటీ సంస్థలను ఏర్పాటు చేశారు.

జవహర్‌నగర్‌ను అభివృద్ధి చేయకపోగా డంపింగ్‌ యార్డ్‌ను బహుమతిగా ఇచ్చారు. మేడ్చల్, జవహర్‌నగర్‌లలో ఐటీ కంపెనీలు రాకుండా బీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుపడుతున్నారు. మేడ్చల్‌లో ఐటీ పార్క్‌ తెస్తామని గొప్పలు చెప్పిన కేటీఆర్‌ పత్తాలేకుండా పోయారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఐటీ కారిడార్‌ను ఏర్పాటు చేస్తాం..’’అని తెలిపారు. 

మల్లారెడ్డి టికెట్‌ కోసం ఎన్నికోట్లు ఇచ్చారు? 
రాష్ట్రంలో కేసీఆర్‌ వందల కోట్లు దండుకుంటుంటే.. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి చెరువులను కబ్జాచేస్తూ, కిందిస్ధాయి ప్రజాప్రతినిధులకు సీట్లు అమ్ముకుని వందల కోట్లు వెనకేసుకున్నారు. జవహర్‌నగర్‌లో ప్రభు త్వ స్థలంలో మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రి కట్టినా పట్టించుకోవడం లేదుగానీ.. పేదలు 60 గజాల్లో గుడిసెలు వేసుకుంటే కూల్చివేస్తున్నారు. ఇంత అవినీతికి పాల్పడ్డ మల్లారెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ కోసం కేసీఆర్‌కు ఎన్ని కోట్లు ఇచ్చారో చెప్పాలి..’’అని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.

ఇక్కడ మూడుచింతలపల్లిని దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్‌ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి వంటి ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు మూడోసారి గెలిపించాలంటూ వస్తున్నారని విమర్శించారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసిందని కేసీఆర్‌ అడుగుతున్నారని.. హైదరాబాద్‌లో ఔటర్‌ రింగురోడ్డు, శంషాబాద్‌ విమానాశ్రయం, ఫార్మా కంపెనీలు, మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, గోదావరి, కృష్ణా జలాల తరలింపు వంటివి వచ్చిది కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే కాదా? అని ప్రశ్నించారు. 

దొరల ప్రభుత్వాన్ని కూల్చాలి 
అసలు తెలంగాణ ఇచ్చింది సోనియాగాందీ, కాంగ్రెస్‌ పార్టీ అని.. రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్‌ కుటుంబం నాంపల్లి దర్గా వద్దో. బిర్లామందిర్‌ మెట్లపైనో బిచ్చమెత్తుకునే వారని రేవంత్‌ అన్నారు. హరీశ్‌రావుకు వేల కోట్లు ఎలా వచ్చాయని, కేసీఆర్, కేటీఆర్‌లకు వేల ఎకరాల భూములు, ఫామ్‌హౌస్‌లు ఎక్కడివని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు దొరల పాలనకు, పేదలకు మధ్య పోరాటమని.. పేదల ప్రభుత్వం రావాలంటే దొరల ప్రభుత్వాన్ని కూల్చాలని పిలుపునిచ్చారు. 

రైతులను మోసం చేస్తున్న కేసీఆర్‌ 
కేసీఆర్‌ రైతుబంధు, రైతు బీమా అంటూ రైతులను మోసం చేస్తున్నారని.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 91వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు నివేదికలే వెల్లడించాయని రేవంత్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా 30లక్షల మంది నిరుద్యోగులను ముంచిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలతో పేదలకు మేలు జరుగుతుందన్నారు.

ఇల్లు లేని వారికి 250 గజాల స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తామని.. ఆడపిల్లలకు పెళ్లినాడే రూ.లక్ష ఆర్థిక సా యంతోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్‌ మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు, జవహర్‌నగర్‌ ముదిరాజ్‌ జిల్లా యువజన అధ్యక్షుడు అనిల్, రజక, కురుమ సంఘం సభ్యులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

మరిన్ని వార్తలు