సంస్థాగత నిర్మాణంపై లెఫ్ట్ పార్టీల దృష్టి

13 May, 2016 01:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: సంస్థాగతంగా పార్టీలను బలోపేతం చేయడంపై సీపీఐ, సీపీఎం నాయకులు దృష్టి కేంద్రీకరించారు. ఇందుకోసం వివిధ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. ప్రధానంగా సైద్ధాంతిక అవగాహన, రాజకీయ శిక్షణ తరగతులతో కేడర్‌లో ఉత్సాహం నింపాలని ఈ పార్టీలు భావిస్తున్నాయి. రాబోయే 3, 4 నెలల పాటు వివిధ కార్యక్రమాలను చేపట్టాలని సీపీఐ నిర్ణయించగా, సీపీఎం కూడా అదే బాటలో నడుస్తోంది. కాగా పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేసే చర్యల్లో భాగంగా వచ్చే సెప్టెంబర్ వరకు సీపీఐ నాయకులు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు.

జూన్ నుంచి ఆగస్టు వరకు గ్రామ, మండల, జిల్లాస్థాయి పార్టీ నిర్మాణ సమావేశాలను నిర్వహించాలని షెడ్యూల్‌ను రూపొందించారు. జిల్లాస్థాయిలో కార్యక్రమాలు ముగిశాక సెప్టెంబర్‌లో పార్టీనిర్మాణ రాష్ట్ర మహాసభను వరంగల్‌లో నిర్వహించాలని సీపీఐ నాయకత్వం నిర్ణయించింది. కాగా మండల కౌన్సిల్ సభ్యులు మొదలుకుని రాష్ర్ట కౌన్సిల్ సభ్యుల వరకు వివిధ స్థాయిల్లో రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు.  
 
22 నుంచి సీపీఎం శిక్షణ తరగతులు
ఈ నెల 22 నుంచి నెలాఖరు వరకు హైదరాబాద్, మిర్యాలగూడ, ఖమ్మంలలో సీపీఎం  శిక్షణ తరగతులను నిర్వహించనుంది.  డివిజన్ కమిటీ, జిల్లా కమిటీ సభ్యులు, పూర్తికాల కార్యకర్తలకు ఇందులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత మండల స్థాయిలో తరగతులను నిర్వహిస్తారు. అంబేడ్కరిజం, మార్క్సిజం, ప్రజా సమస్యలపై అవగాహన, జాతీయ, రాష్ట్రస్థాయిలో రాజకీయ పరిస్థితులపై తరగతులను నిర్వహించి కేడర్‌ను సైద్ధాంతికంగా బలోపేతం చేయాలని సీపీఎం భావిస్తోంది.

మరిన్ని వార్తలు