రాహుల్‌ ఎక్కడ?

12 Nov, 2023 10:04 IST|Sakshi

రాజస్థాన్‌ ప్రచారంలో కాలుమోపని వైనం!

ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతోంది..

కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తల్లో ఆవేదన!

ఓటమి ఖాయమనే ముఖం చాటు: బీజేపీ

సాక్షి: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ ప్రచారకుల జాబితాలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ తర్వాత మూడో స్థానంలో ఉన్నది రాహులే. ఖర్గే రెండు మూడుసార్లు రాష్ట్రంలో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ కూడా రెండు ర్యాలీల్లో ప్రసంగించారు. కానీ రాహుల్‌ మాత్రం రాష్ట్రంలో అడుగు పెట్టి ఏకంగా నెలన్నర దాటింది! ఆయన చివరిసారిగా సెప్టెంబర్‌ 23న జరిగిన రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యకర్తల భేటీలో పాల్గొన్నారు. ఇంత హోరాహోరీగా జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ తరఫున అన్నీ తానై ప్రచార భారం మోయాల్సిన ఆయన ఎందుకిలా దూరంగా ఉంటున్నారన్న దానిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది...

తెలంగాణకు వెళ్లారుగా: బీజేపీ
రాహుల్‌ గైర్హాజరీకి రాజస్థాన్‌ కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్న కారణాలు కూడా పెద్దగా నమ్మశక్యంగా లేవన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజస్థాన్‌ కంటే ముందుగా పోలింగ్‌ జరుగుతున్న మిగతా రాష్ట్రాల్లో ప్రచారంలో రాహుల్‌ బిజీగా ఉన్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి సుఖీందర్‌సింగ్‌ రణ్‌ధవా చెప్పుకొచ్చారు. అందుకే ప్రస్తుతానికి ఆయన రాష్ట్రంపై దృష్టి పెట్టడం లేదన్నారు. కానీ ఇది సాకు మాత్రమేనని బీజేపీ అంటోంది. రాజస్థాన్‌ తర్వాత ఐదు రోజులకు నవంబర్‌ 30న పోలింగ్‌ జరగనున్న తెలంగాణలో రాహుల్‌ ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్న విషయాన్ని ప్రస్తావిస్తోంది.

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ విజయంపై రాహుల్‌కు పెద్దగా నమ్మకం లేనట్టుందన్న చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లోనే సాగుతోంది! సెప్టెంబర్‌లో ఢిల్లీలో ఓ కార్యక్రమంలో రాహుల్‌ మాటలు కూడా దీన్ని బలపరిచేవిగానే ఉండటం విశేషం. ‘మేం మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ల్లో కచ్చితంగా గెలుస్తున్నాం. తెలంగాణలోనూ విజయ సూచనలున్నాయి’ అని చెప్పిన ఆయన, ‘రాజస్థాన్‌లో బహుశా గెలుస్తామేమో’ అంటూ ముక్తాయించారు. ఆయన నుంచి ఇలాంటి వ్యాఖ్యలను ఊహించలేదంటూ అప్పట్లోనే రాజస్థాన్‌ కాంగ్రెస్‌ వర్గాలు ఆవేదన వెలిబుచ్చాయి!

ఆనవాయితీ మార్చాలనుకుంటే...
నిజానికి రాజస్థాన్‌లో ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వం మారడం ఆనవాయితీ. కానీ ఈసారి ఎన్నికలకు ముందు దాకా విపక్ష బీజేపీలో అంతర్గత పోరు గట్టిగానే కొనసాగింది. దానికి తోడు సీఎం అశోక్‌ గహ్లోత్‌ కొద్ది నెలలుగా వరుసబెట్టి ప్రజాకర్షక పథకాలను ప్రకటించారు. కనుక అధికార పార్టీ ఓడిపోయే ఆనవాయితీని ఈసారి మార్చగలమని రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యకర్తలు అప్పట్లో భావించారు. తీరా ఎన్నికలు సమీపించే సమయానికి బీజేపీలో ఇంటి పోరు సద్దుమణిగింది. ఇటు చూస్తే ప్రధాన నాయకుడే రాష్ట్రం వైపు తొంగి కూడా చూడకపోవడం వారిలో నిరాశను పెంచుతోంది. 

గహ్లోత్‌–పైలట్‌ కుమ్ములాటలూ కారణమే!
రాజస్థాన్‌కు రాహుల్‌ కాస్త దూరంగా ఉండటానికి సీఎం గహ్లోత్, యువ నేత సచిన్‌ పైలట్‌ మధ్య తీవ్ర విభేదాలు కూడా కారణమని రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎవరికి పట్టున్న ప్రాంతంలో ప్రచారానికి వెళ్లినా రెండోవారిని బాధపెట్టినట్టు అవుతుందన్న భావన బహుశా ఆయనలో ఉండవచ్చని చెబుతున్నారు.

పైగా గతేడాది కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టాలన్న సోనియా ఆదేశాన్ని కూడా గహ్లోత్‌ బేఖాతరు చేయడం తెలిసిందే. దీనిపైనా రాహుల్‌ అసంతృప్తిగా ఉన్నారని ఏఐసీసీ వర్గాలంటున్నాయి. కారణమేదైనా ప్రచార పర్వంలో రాహుల్‌ గైర్హాజరు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపడం ద్వారా కాంగ్రెస్‌ విజయావకాశాలను దెబ్బ తీస్తోందన్న ఆందోళన ఆ పార్టీ నేతలతో పాటు కార్యకర్తల్లో కూడా వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆయన దీపావళి అనంతరం నిజంగానే ప్రచారానికి వచి్చనా పెద్దగా ఒరిగేదేమీ ఉండదంటూ పలువురు కాంగ్రెస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలు ఆ నైరాశ్యానికి అద్దం పట్టేలానే ఉన్నాయి!

మరిన్ని వార్తలు