ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాలి

9 Apr, 2017 03:28 IST|Sakshi
ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాలి

- వామపక్షాలు, ప్రజాసంఘాల డిమాండ్‌
- ప్రభుత్వం దిగిరాకపోతే ఈ నెల 15 నుంచి రిలే దీక్షలు
- మే 10న ధర్నాచౌక్‌ ఆక్రమణ


సాక్షి, హైదరాబాద్‌: ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని వివిధ వామపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఈ నెల 15 నుంచి సమాజంలోని వివిధ వర్గాలు, ప్రజాసంఘాల ప్రతినిధులతో వచ్చేనెల 9 వరకు రిలే నిరాహారదీక్షలను చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ధర్నాచౌక్‌ పరిరక్షణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా మే 10న ఇందిరాపార్కు ఆక్రమణ పేరిట రాష్ట్రవ్యాప్త ‘చలో ధర్నాచౌక్‌’ను నిర్వహించనున్నట్లు తెలిపాయి.

శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ వర్కింగ్‌గ్రూప్‌ సభ్యులు మల్లేపల్లి ఆదిరెడ్డి (సీపీఐ), చెరుపల్లి సీతారాములు (సీపీఎం), కె.గోవర్ధన్‌ (న్యూడెమోక్రసీ–చంద్రన్న), పోటురంగారావు (న్యూడెమోక్రసీ–రాయల), పీఎల్‌ విశ్వేశ్వరరావు (ఆప్‌), రవిచందర్‌ (తెలంగాణ  ప్రజాస్వామిక వేదిక), కె.సజయ (సామాజిక పరిశోధకురాలు), పంజుగుల శ్రీశైల్‌రెడ్డి (ప్రజాతెలంగాణ) విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 20 వరకు అన్ని జిల్లాల్లో ధర్నాచౌక్‌ పరిరక్షణపై రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, ఇతరత్రా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.

ఈ నెల 15వ తేదీ నుంచి సీపీఐ కార్యాలయం మగ్దూంభవన్‌ ఆవరణలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే దీక్షలు ఉంటాయన్నారు. 15న మొదట వామపక్షాల నేతలు, 16న కార్మికసంఘాలు, 17న వ్యవసాయకార్మిక సంఘాలు, 18న విద్యార్థి సంఘాలు, 19న యువజన సంఘాలు, ఇంకా మే 2న ట్రాన్స్‌జెండర్స్, మే 8న బీడి కార్మిక సంఘాలు, మే 9న ట్రాన్స్‌పోర్టు (బస్సు,ఆటో) సంఘాల ప్రతినిధులు ఈ దీక్షల్లో పాల్గొంటారని చెప్పారు. అంతకుముందు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన  ప్రజాసంఘాల రాష్ట్ర సదస్సులో 50కి పైగా సంఘాల ప్రతినిధులు పాల్గొని ధర్నాచౌక్‌ పరిరక్షణ కార్యాచరణపై తమ అభిప్రాయాలను వెల్లడించారని వారు తెలియజేశారు.

మరిన్ని వార్తలు