రోజా ‘సారీ’చెప్పాల్సిందే

22 Mar, 2016 02:50 IST|Sakshi
రోజా ‘సారీ’చెప్పాల్సిందే

నాని ‘సారీ’ని పట్టించుకోం..


- సభ నిర్ణయమే ఫైనల్.. స్పీకర్‌కే సర్వాధికారాలు
- న్యాయస్థానాలు సైతం గౌరవించాల్సిందే: యనమల
- రోజా జీతభత్యాలను ఆపే అధికారం సభకు ఉందన్న మంత్రి

- ‘ప్రివిలేజ్’కు క్షమాపణ చెబితే రోజా సస్పెన్షన్‌పై పునఃపరిశీలన
- జ్యోతుల, కోటంరెడ్డి, చెవిరెడ్డి వివరణలు పరిగణనలోకి
- విపక్షం లేకుండానే శాసనసభ తీర్మానం

 
సాక్షి, హైదరాబాద్:
విపక్షం లేకుండా ఏకపక్షంగా సాగిన శాసనసభ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ ను కొనసాగించాల్సిందేనని తీర్మానించింది. ఆమె తన వివరణ తెలిపేందుకు మరో అవకాశం ఇవ్వాలని, ప్రివిలేజ్ కమిటీకి రోజా క్షమాపణలు చెబితే సస్పెన్షన్‌ను పున:పరిశీలించాలని నిర్ణయించింది.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇచ్చిన వివరణలను సభ పరిగణనలోకి తీసుకుంది. మరో ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) వివరణతో సభ విభేదించింది. రోజా సస్పెన్షన్ వ్యవహారంపై సభా హక్కుల కమిటీ ఇచ్చిన నివేదికను శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం సభ ముందుంచారు. దీనిపై నాలుగు గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంపై విమర్శల దాడి కొనసాగించారు.

ఎంతకాలమైనా సస్పెండ్ చేయొచ్చు: యనమల
సభ్యులను సస్పెండ్ చేసే విషయంలో స్పీకర్‌కు సర్వాధికారాలున్నాయని మంత్రి యనమల చెప్పారు. దీన్ని ప్రశ్నించే హక్కు ఏ వ్యక్తులకు, వ్యవస్థలకూ లేదన్నారు. సభ్యుడిని/సభ్యురాలిని ఎంతకాలమైనా సస్పెండ్ చేయవచ్చని, దీనికి చట్టంలో ఎలాంటి కాలపరిమితి లేదని పేర్కొన్నారు. తాము హౌస్ ఆఫ్ కామన్స్ విధానాన్ని అనుసరిస్తున్నామని, దాని ప్రకారం రోజాను సస్పెండ్ చేసే అధికారం తమకు ఉందని తెలిపారు. ఆమె ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గ ప్రజల సమస్యలు సభ దృష్టికి వచ్చే అవకాశం లేకపోవడం సరికాదన్న కొంతమంది సభ్యుల సూచనలను యనమల తోసిపుచ్చారు. అసలీ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని చట్టాలు చెబుతున్నాయన్నారు. శాసనసభ నిర్ణయాలను న్యాయస్థానాలుసైతం గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు.

అసెంబ్లీయే సుప్రీం కాబట్టి, స్పీకర్ అధికారాలను కోర్టులు ప్రశ్నించజాలవన్నారు. అనారోగ్య కారణాల వల్ల ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కాలేకపోతున్నట్టు రోజా తెలిపారని, ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా ప్రివిలేజ్ కమిటీ సభకు నివేదిక ఇస్తే పరిశీలించవచ్చని చెప్పారు. అప్పటివరకు ఆమెపై సస్పెన్షన్‌ను కొనసాగించాల్సిందేనని పేర్కొన్నారు. రోజా జీతభత్యాలను నిలిపివేసే అధికారమూ సభకు ఉందని చెప్పారు. జ్యోతుల నెహ్రూ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పిన క్షమాపణలను కమిటీ సూచనల మేరకు పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపాదించారు. కొడాలి నాని క్షమాపణతో మాత్రం విభేదిస్తున్నట్టు తెలిపారు. అయితే, ఆయనపై చర్యల విషయంలో స్పష్టత ఇవ్వలేదు.

ఇలాంటి చర్చ దురదృష్టకరం: స్పీకర్ కోడెల
ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఆధారంగా యనమల చేసిన సవరణ ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ... డిసెంబర్ 18న జరిగిన సంఘటనలు బాధాకరమైనవని, దీనిపై ఇలాంటి చర్చ జరగడం దృరదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం కూడా ఈ చర్చలో పాల్గొని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. శాసనసభ సార్వభౌమత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందని, ఈ దిశగా సభ్యులందరూ కృషి చేయాలని కోరారు.  

సాధారణంగా ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు మూడు మార్గాలున్నాయని, పశ్చాత్తాపపడటం, రాజీ చేసుకోవడం, యుద్ధం చేయడమేనని వివరించారు. తప్పు జరిగినప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేయడం నేరం కాదన్నారు. ఇదే సభలో ఎంతో మంది తమ తప్పును ఒప్పుకున్నారని గుర్తు చేశారు. కొంతమంది లిఖితపూర్వకంగానూ క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయని తెలిపారు.

విపక్షమే లక్ష్యంగా విమర్శలు
శాసనసభలో విపక్షం లేకపోవడంతో అధికార పార్టీ సభ్యులు విమర్శలకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. కోర్టు తీర్పును పట్టుకుని ఎమ్మెల్యే రోజా హైడ్రామా సృష్టించారని దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. విపక్షాన్ని అదుపు చేయడంలో అధికార పార్టీ పూర్తిగా విఫలమవుతోందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. దీనికోసమైనా రోజాను కఠినంగా శిక్షించాలని, ప్రతిపక్ష సభ్యులను నిలువరించాలని సూచించారు. రోజా తీరు వల్ల దళితులకు మానసిక క్షోభ కలుగుతోందని యామిని బాల, ఆనందరావు పేర్కొన్నారు. చర్చ అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు