TS: ఒక్కరోజులో 12 కరోనా కేసులు

24 Dec, 2023 05:43 IST|Sakshi

హైదరాబాద్‌లోనే 9 మందికి వ్యాప్తి.. జీనోమ్‌ సీక్వెన్స్‌ కోసం 40 నమూనాలు

ఫ్లూ జ్వరాలతో ఎక్కువ కేసులు

సీఎస్‌ఆర్‌ నిధులపై నివేదిక కోరిన మంత్రి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రోజురోజు­కూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. శని­వా­రం 1,322 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 12 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ రవీంద్ర నాయక్‌ వెల్లడించారు. ఈ మేరకు కరోనా బులెటిన్‌ విడుదల చేశారు.

నమోదైన కేసుల్లో తొమ్మిది హైదరాబాదులోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ప్రస్తుతం 38 మంది ఐసోలేషన్‌ లేదా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్‌  మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8.44 లక్షలకు చేరింది. అందులో 8.40 లక్షల మంది రికవరీ అయ్యా­రు. చలికాలం కావడం, ఫ్లూ జ్వరాలు కూ­డా ఉండటం తదితర కారణాలతో కరోనా కేసులు నమోదవుతున్నట్లు  చెబుతున్నారు.

పర్యాటకులకు తప్పనిసరి ఐసోలేషన్‌
తాజాగా రాష్ట్రంలోకి వచ్చే పర్యాటకుల కోసం తప్పనిసరి ఐసోలేషన్‌ను ప్రారంభించాలని రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ వైద్యుల ప్యానెల్‌  వైద్య ఆరోగ్య శాఖకు సూచించింది. పొరుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కేరళ, గోవా, మహారాష్ట్రలలో కోవిడ్‌ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షించాలని కోరింది.

జేఎన్‌.1 వేరియంట్‌ పై స్పష్టమైన అవ­గాహనకు రావాల్సి ఉందని పేర్కొంది. కేరళ లేదా ఇతర ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి వచ్చేవారు ఎవరైనా వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. పైగా చాలా మందిలో వైరస్‌ లక్షణాలు కనిపించడం లేదనిడాక్టర్ల బృందం అభిప్రాయపడింది.

జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం 40 నమూనాలు..: రాష్ట్రంలో కరోనా కేసులు ఏ వేరియంట్‌ అనేది తెలు­సుకునేందుకు జీనోమ్‌ సీక్వె­న్సింగ్‌ చే­స్తు­న్నారు.  గత వారం మొత్తం 40 నమూ­నా­లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామో­దర రాజనర్సింహ తెలిపారు.  ఆయన ఉన్నత స్థాయి సమీ­క్ష నిర్వహించారు. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కో­సం 4–5 రో­జు­ల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. 

సమావేశంలో మంత్రి ఆదేశాలిలా.. 

  • పని చేయని పీఎస్‌ఏ ప్లాంట్ల సమస్యల­ను వీలైనంత త్వరగా పరిష్కరించాలి.
  • ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను సరిగ్గా వినియోగించాలి.
  • అన్ని వెంటిలేటర్లను అందుబాటులోకి తీసుకురావాలి. 
  • వైద్య పరికరాలు, డ్రగ్స్, డయాగ్నస్టిక్స్‌ మొదలైన వాటి అవసరాలను ఆసుప­త్రులు తెలియజేయాలి.
  • మొత్తం 34 ప్రభుత్వ ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌­లు రోజుకు 16,500 నమూనాల­ను పరీ­క్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
  • 34 ప్రభుత్వ ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లతో పాటు, రాష్ట్రంలో 84 ప్రైవేట్‌ ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు ఉన్నాయి.
  • ఆర్టీపీసీఆర్‌ కిట్‌లు మొదలైన వాటిని టిఎస్‌ఎంఎస్‌ఐడిసి సేకరించి సరఫరా చేస్తుంది.
  • గత 2 వారాల్లో మొత్తం 6,344 నమూ­నా­లు సేకరించారు.
  • నెలాఖరు నాటికి పరీక్షలను వేగవంతం చేయాలి. రోజుకు 4,000 పరీక్షలు నిర్వహించాలి. 
  • గాంధీ హాస్పిటల్‌లోనూ జీనోమ్‌ సీక్వె­న్సింగ్‌ కోసం నమూనాలను పంపాలి
  • కోవిడ్‌ రోజువారీ నివేదికను ప్రతిరో­జూ సాయంత్రం 4 గంటలలోపు సమర్పించాలి.
  • కరోనాను ఎదుర్కొనేందుకు వివిధ సంస్థల నుంచి గత నాలుగేళ్లుగా అందిన సీఎస్‌ఆర్‌ విరాళాల జాబితాపై నివేదిక అందజేయాలి.
>
మరిన్ని వార్తలు