మున్సిపాలిటీలుగా మార్చడం సరికాదు

16 Apr, 2016 04:54 IST|Sakshi
మున్సిపాలిటీలుగా మార్చడం సరికాదు

ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన నోటీసు ఆధారంగా ఇప్పుడు జీవో ఇచ్చారు
హైకోర్టులో ఎంపీపీ విక్రంరెడ్డి పిటిషన్

 
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్ మండల పరిధిలోని మీర్‌పేట, జిల్లెలగూడ, కొత్తపేట, బాలాపూర్, జల్లపల్లి, పహాడీషరీఫ్ గ్రామ పంచాయతీలను డీనోటిఫై చేసి మున్సిపాలిటీలుగా మార్చడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పంచాయతీరాజ్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన జీవో 28ని కొట్టేసి, ఆ గ్రామాల్లో పంచాయతీల విధుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సరూర్‌నగర్ ఎంపీపీ తీగల విక్రంరెడ్డి వ్యాజ్యం దాఖలు చేశారు. ఇందులో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, ఆ శాఖ డెరైక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కొన్ని మార్గదర్శకాలకు లోబడి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జారీ అయిన షోకాజ్ నోటీసుల ఆధారంగా ఇప్పుడు డీ నోటిఫై నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరిగి కొత్త నోటిఫికేషన్ జారీ చేసి, గ్రామ సభ నిర్వహించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం తప్పనిసరన్నారు. అయితే ఈ విధి విధానాలను ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం హైకోర్టు విచారించనుంది.

>
మరిన్ని వార్తలు