నేడు బీఆర్‌ఎస్‌ ‘స్వేద పత్రం’

23 Dec, 2023 09:41 IST|Sakshi

గత తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని వివరించేందుకు సిద్ధం 

కాంగ్రెస్‌ సర్కారు విడుదల చేసిన శ్వేతపత్రాలపై తమ వాదన వినిపించే యత్నం

వివిధ రంగాల్లో గణాంకాలతో కేటీఆర్, హరీశ్‌రావు తదితరుల ప్రజెంటేషన్‌ 

నేటి ఉదయం 11 గంటలకు తెలంగాణభవన్‌లో కార్యక్రమం 

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ వేదికగా రెండు రోజుల పాటు కాంగ్రెస్‌ సర్కారు విడుదల చేసిన శ్వేతపత్రాలపై తమ వాదన వినిపించేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ సాగించిన ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని.. దానికోసం తమ ప్రభుత్వం చిందించిన చెమటను ప్రజలకు వివరించేందుకు ‘స్వేద పత్రం’పేరిట పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాలని నిర్ణయించింది.

శనివారం ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయం తెలంగాణభవన్‌ వేదికగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి కేటీఆర్‌ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. ‘‘పగలూరాత్రీ తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయతి్నస్తే భరించం. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం. అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు.. అప్పులు కాదు, తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు ‘స్వేద పత్రం’విడుదల చేస్తున్నాం’’అని ప్రకటించారు.

వాస్తవాలను వివరించేందుకే.. 
ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపంలో స్పందించేందుకు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పీకర్‌కు లేఖ రాయడం తెలిసిందే. అయితే అధికార కాంగ్రెస్‌ పక్షం పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్‌కు అవకాశం దక్కలేదు. ఈ క్రమంలో శ్వేతపత్రాలపై అసెంబ్లీలో బుధ, గురువారాల్లో చర్చ సందర్భంగా ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించి తమపై బురద జల్లేందుకే ప్రయత్నించిందని బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శిస్తున్నారు. తాము వివరణలు కోరినా సమాధానాలు రాలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌ వేదికగా ‘స్వేద పత్రం’ పేరిట పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్తున్నారు. 

అంశాలన్నింటినీ క్రోడీకరించి.. 
అసెంబ్లీలో శ్వేతపత్రాలపై చర్చ సమయంలోనే.. ‘పదేళ్లలో సృష్టించిన ఆస్తులు’, ‘ఫ్యాక్ట్‌ షీట్‌’పేరిట రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై బీఆర్‌ఎస్‌ రెండు నివేదికలను విడుదల చేసింది. ఇప్పుడు వాటిలోని అంశాలను క్రోడీకరించడంతోపాటు రంగాల వారీగా మరిన్ని వివరాలు జోడిస్తూ.. ‘స్వేద పత్రం’ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్టు బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. 

>
మరిన్ని వార్తలు