అవకతవకల ‘మిషన్’ను ప్రారంభించొద్దు

5 Aug, 2016 01:03 IST|Sakshi
అవకతవకల ‘మిషన్’ను ప్రారంభించొద్దు

సాక్షి, హైదరాబాద్: అవకతవకలు, అబద్ధాలతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యక్తిగత ప్రచారం చేసుకుంటున్న మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించొద్దని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రధాని ఈ నెల 7న మెదక్ జిల్లా గజ్వేల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయనకు ఉత్తమ్ గురువారం లేఖ రాశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పూర్తి చేసిన పథకానికి మిషన్ భగీరథగా కేసీఆర్ పేరు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సుజల స్రవంతి ప్రాణహిత-చేవెళ్ల పథకంలో భాగంగా హైదరాబాద్‌కు 30 టీఎంసీల నీటిని తరలించేందుకు తమ ప్రభుత్వం 2008లో భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సుజల స్రవంతి పేరుతో ఈ పథకాన్ని చేపట్టిందని ఉత్తమ్ వివరించారు. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటిని అందించడానికి ఎల్లంపల్లి జలాశయం నుంచి మొదటి దశలో 10 టీఎంసీలు తరలించేందుకు రూ. 3,350 కోట్లతో 2008లోనే పనులు ప్రారంభించిందన్నారు.

భూసేకరణ, పైపులైన్ల నిర్మాణం, ప్రాజెక్టుల నిర్మాణానికి హడ్కో రూ. 1,564 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,955.83 కోట్లు ఖర్చు చేసిందన్నారు. మార్గమధ్యలోని అన్ని గ్రామాలకు తాగునీటిని అందించడం కూడా ఈ ప్రాజెక్టులో భాగమేనన్నారు. గజ్వేల్ మీదుగా చేపట్టిన ఈ పనులన్నీ 2015లోనే పూర్తయ్యాయన్నారు. అందువల్ల ఈ ప్రాజెక్టును ప్రధానిగా ప్రారంభించడం సరికాదని ఉత్తమ్ హెచ్చరించారు.

ఈ విషయంలో కావాలంటే బీజేపీ రాష్ట్రశాఖ నుంచి కూడా వివరాలు తీసుకోవాలని సూచించారు. కాగా, రాష్ట్రానికి తొలిసారి వస్తున్న సందర్భంగా ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలను, ఆ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలను, హక్కులను అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కోరారు. జాతీయ నేతలను అవమానించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

మరిన్ని వార్తలు