ఈఎస్‌ఐ ఆస్పత్రి కేంద్రానికి

28 Feb, 2016 03:43 IST|Sakshi
ఈఎస్‌ఐ ఆస్పత్రి కేంద్రానికి

కేంద్ర, రాష్ట్ర మంత్రులు దత్తాత్రేయ, నాయినిల మధ్య అంగీకారం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని కేంద్రానికి ఇచ్చేందుకు సయోధ్య కుదిరింది. ఈ మేరకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి నాయిని నర్సింహారెడ్డిల మధ్య అంగీ కారం కుదిరింది. ఇద్దరు మంత్రులు ఈఎస్‌ఐసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరంలో సనత్‌నగర్ ఆసుపత్రిలో ఈఎస్‌ఐ మెడికల్ కళాశాలను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు దత్తాత్రేయ తెలిపారు.

మెడికల్ కాలేజీ కోసం సనత్‌నగర్ ఆస్పత్రిని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినందున.. కేంద్రం పరిధిలోని నాచారం ఆస్పత్రిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అలాగే గోషామహల్‌లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉంద ని, రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరారు. వరంగల్‌లో శిథిలావస్థకు చేరిన ఈఎస్‌ఐ ఆస్పత్రి స్థానంలో 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తామన్నారు. నిజామాబాద్‌లో 10 పడకల ఆస్పత్రిని 50 పడకలకు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. మెడికల్ కాలేజీ ప్రారంభమైతే రాష్ట్ర కార్మికులకు మంచి రోజులు వచ్చినట్లేనని నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. నాచారంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని 250 నుంచి 500 పడకలకు పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అలాగే ఎర్రగడ్డలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్థలాన్ని కేటాయిస్తామని, 500 పడకల కొత్త ఆస్పత్రి భవనాన్ని నిర్మించాలని కోరారు.

చరిత్రలో నిలిచేలా సేవ చేయాలి
కార్పొరేటర్లకు నాయిని పిలుపు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లందరూ చరిత్రలో నిలిచిపోయేలా సేవ చేయాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు.శనివారం తెలంగాణ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇటీవల గెలిచిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 29 మంది కార్పొరేటర్లని అబిడ్స్ ఆర్‌బీవీఆర్‌ఆర్ హాస్టల్‌లో సన్మానించా రు. నాయిని మాట్లాడుతూ... ‘సీఎం కేసీఆర్‌ను నమ్మి, ఆయన అభివృద్ధిని చూసి 99 మంది టీఆర్‌ఎస్ కార్పొరేటర్లను ప్రజలు గెలిపించా రు. మీరంతా నిజాయతీగా పనిచేసి కేసీఆర్ గౌరవం నిలపాలి.

లంచం తీసుకోకుండా ఇంటికి అనుమతు లు మంజూరు చేసే పరిస్థితి జీహెచ్‌ఎంసీలో రావాలి. భవిష్యత్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచే లా కృషిచేయాలి’ అన్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘వెలమ, రెడ్డి సామాజిక వర్గాలకు పొసగదని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ కేసీఆర్ అన్ని విషయాల్లో రెడ్లకు ప్రాధాన్యత ఇచ్చారు’ అన్నారు. రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎడ్ల రఘుపతిరెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ సంఘానికి బుద్వేల్ వద్ద 10 ఎకరాల స్థలం కేటాయించనున్నట్టు తెలిపారు. రూ.10 కోట్లు నిధులు కూడా మంజూరు చేశారన్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు