నాయని కృష్ణకుమారి కన్నుమూత

31 Jan, 2016 03:44 IST|Sakshi
నాయని కృష్ణకుమారి కన్నుమూత

తెలుగు సాహితీ రంగంలో విశేష కృషి
18 ఏళ్ల వయసులోనే ‘ఆంధ్రుల కథ’ పేరిట గ్రంథ రచన
ఓయూలో తెలుగు ఆచార్యులుగా మూడు దశాబ్దాలకు పైగా సేవలు
తెలుగు వర్సిటీకి 1996 నుంచి 1999 వరకు ఉపకులపతిగా బాధ్యతలు

 
హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య నాయని కృష్ణకుమారి శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. 1930 మార్చి 14న గుంటూరులో జన్మించిన కృష్ణకుమారి పరిశోధకురాలిగా, కవయిత్రిగా, విద్యావేత్తగా విశిష్ట సేవలందించారు. ప్రముఖ భావ కవి నాయని సుబ్బారావు కుమార్తె అయిన కృష్ణకుమారి.. తండ్రి సాహిత్య వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. జానపద గేయ గాథలు అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఆమెకు భర్త మధుసూదనరావు, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఓయూలో తెలుగు శాఖ ఆచార్యులుగా, శాఖాధిపతిగా మూడు దశాబ్దాలకు పైగా పనిచేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా కళాశాల ప్రధానాచార్యులుగా కూడా సేవలందించారు. 18 ఏళ్ల వయసులోనే కృష్ణకుమారి ఆంధ్రుల కథ అనే గ్రంథాన్ని వెలువరించారు.

ఆమె రాసిన మొట్టమొదటి కవితా సంకలనం ‘అగ్ని పుత్రి’ 1978లో వెలువడింది. ‘ఆయత’ పేరుతో కథల సంపుటిని వెలువరించారు. కాశ్మీర దీపకళిక అనే యాత్రా చరిత్రను ‘కథలు-గాథలు’ పేరుతో సంకలనంగా ప్రచురించా రు. మెకంజీ కైఫీయత్తులు, నల్లగొండ జిల్లా ఉయ్యాల పాటలు, పరిశీలన, తెలుగు భాషా చరిత్ర, తెలుగు జానపద గేయ గాథలు, తెలుగు జానపద విజ్ఞానం వంటి గ్రంథాలను కృష్ణకుమారి రచించారు. తోరుదత్ ఆంగ్లంలో రాసిన ‘ఫోక్‌లోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. గృహలక్ష్మి స్వర్ణకంకణంతోపాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నుంచి, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయానికి 1996 నుంచి 1999 వరకు ఉపకులపతిగా సేవలందించారు. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగను న్నాయి.

కేసీఆర్, బాబు, జగన్ సంతాపం
నాయని కృష్ణకుమారి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ విపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.  జానపద సాహిత్యం, మహిళా సాహిత్యంలో ఆమె విశేషంగా కృషి చేశార ని జగన్ కొనియాడారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌గా ఆమె తెలుగు సాహిత్యరంగ అభివృద్ధికి ఎంతో సేవ చేశారన్నారు. మరోవైపు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి, తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి  లు కృష్ణకుమారి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు