కొత్త జిల్లాల్లో కొత్త బలగం

12 Sep, 2016 01:11 IST|Sakshi
కొత్త జిల్లాల్లో కొత్త బలగం

27 జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటుపై తుది ప్రతిపాదనలు
 పోస్టులు50,970
 ఉద్యోగులు 39,252
 ఖమ్మంకు అత్యధికంగా 3,191 పోస్టులు.. 2,631 మంది ఉద్యోగులు
 మల్కాజ్‌గిరికి అత్యల్పంగా 499 పోస్టులు.. 361 మంది సిబ్బంది
 టాస్క్‌ఫోర్స్‌కు చేరిన నివేదికలు.. పది వేలకుపైగా ఉద్యోగుల కొరత
 కొత్త నియామకాలకు ప్రభుత్వ యోచన.. త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు!
 అప్పటివరకు ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశాలు

 
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఉద్యోగుల పునర్విభజన ప్రక్రియ కొలిక్కి వచ్చింది. దసరా నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినందున అన్ని శాఖలు అందుకు అనుగుణంగా ఉద్యోగులను సర్దుబాటు చేశాయి. శాఖలవారీగా ఉద్యోగుల కేటాయింపులపై తుది ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ  ఈ ప్రతిపాదనలన్నీ క్రోడీకరించి నివేదికను తయారు చేసింది.
 
శాఖల వారీగా కొత్త జిల్లాల్లోని పాలనా స్వరూపాన్ని, నిర్ణీత ఉద్యోగుల ప్రణాళికను నిర్దేశించింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 50,970 మంజూరీ పోస్టులను, ప్రస్తుతం పనిచేస్తున్న 39,252 మంది ఉద్యోగులను 27 జిల్లాలకు కేటాయించేలా తుది ప్రణాళిక సిద్ధం చేసింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాకు 3,191 పోస్టులు, 2,631 మంది ఉద్యోగులు, అతి తక్కువగా మల్కాజ్‌గిరికి 499 పోస్టులు, 361 మంది ఉద్యోగులను పునర్విభజన చేసింది.
 
మంజూరీ పోస్టులతో పోలిస్తే పది వేలకుపైగా ఉద్యోగుల కొరత ఉన్నట్లు ప్రతిపాదనలు చూస్తే స్పష్టమవుతోంది. కొత్త నియామకాలతో వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే కొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయడంతో తదుపరి అవసరమైన పోస్టుల వివరాలతో మరిన్ని నోటిఫికేషన్లకు రంగం సిద్ధం చేయనుంది. అప్పటివరకు అవసరమైన మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను అందుబాటులో ఉంచుకోవాలని ఇప్పటికే కలెక్టర్లకు టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.
 
కొత్తగా ఏర్పడే 17 జిల్లాలకు ఉద్యోగులను కేటాయించాలంటే జిల్లా కేంద్రాల్లో ఉన్న ఉద్యోగుల సంఖ్య మూడింత లు పెరగటం ఖాయం. ఆ మేరకు కొత్త ఉద్యోగ  నియామకాలు చేపట్టాలనుకున్నా.. ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదు. అందుకే పని భారం, పని స్వభావానికి అనుగుణంగా పరిపాలనకు కొత్తరూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదే క్రమంలో సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతులు తుది ప్రతిపాదనలు తయారు చేశారు.
 
విలీనానికి అనుగుణంగా కేటాయింపు
కొత్త జిల్లాల నేపథ్యంలో ఒకే పనితీరు ఉన్న కొన్ని విభాగాలను జిల్లా స్థాయిలో విలీనం చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. టాస్క్‌ఫోర్స్ కమిటీ అందుకు వీలుగా శాఖల పునర్వ్యవస్థీకరణ, అధికారిక హోదాల మార్పు, కొత్త పేర్లు, జిల్లా కార్యాలయాల్లో ఉండాల్సిన ఉద్యోగుల ప్రణాళికను ఖరారు చేసింది.

కొన్ని విభాగాల్లో జిల్లాస్థాయి హోదా ఉన్న అధికారులు లేకపోతే.. తదుపరి కేడర్ ఉన్న అధికారులకు కొత్త జిల్లాల బాధ్యతలు అప్పగించనున్నారు. కేడర్‌లో తేడా ఉన్నప్పటికీ జిల్లా స్థాయి అధికారులను ఒకే పేరుతో పిలిచేందుకు వీలుగా పేర్లను సైతం మార్చనున్నారు. ఉదాహరణకు ప్రజారోగ్య శాఖ పరిధిలో ప్రస్తుతం తొమ్మిది మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జిల్లా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
సర్దుబాటులో భాగంగా అర్హులైన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను కొత్త జిల్లాల్లో నియమిస్తారు. కేడర్‌లో తేడా ఉన్నా జిల్లాస్థాయిలో ఈ పోస్టును జిల్లా ప్రజారోగ్య శాఖ అధికారి (డీపీహెచ్‌ఈ)గా పిలుస్తారు. మరోవైపు జిల్లా స్థాయిలో కొన్ని విభాగాల విలీనంపై ఇప్పటికీ ఆయా శాఖలు భిన్నమైన ప్రతిపాదనలు సమర్పించాయి. ప్రధానంగా సంక్షేమ శాఖల విలీనానికి సంబంధించి మూడు రకాలుగా ప్రతిపాదనలు, ఉద్యోగుల కేటాయింపునకు ఏర్పాట్లు జరిగాయి. దీంతో ముఖ్యమంత్రి తీసుకునే తుది నిర్ణయం మేరకు ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కొత్త జిల్లాలకు ఉద్యోగులను కేటాయించేటప్పుడు సీనియారిటీకి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, ఒకే కేడర్ ఉన్న ఉద్యోగులైతే స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరందరికీ ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు జారీ చేసేందుకు వీలుగా మార్గదర్శకాలు సిద్ధం చేసింది.
 
 ------------------------------------
 కొత్త జిల్లా        మంజూరీ పోస్టులు        ఉద్యోగులు
 ------------------------------------
 హైదరాబాద్         2,263            1,591
 ఆదిలాబాద్        1,978            1,539
 కొమురంభీమ్        2,588            1,951
 నిర్మల్            1,620            1,304
 కరీంనగర్            2,635            2,083
 జగిత్యాల            1,433            1,067
 పెద్దపల్లి            1,533            1,215
 హన్మకొండ        1,168            924
 వరంగల్            1,688            1,326
 భూపాలపల్లి        1,337            1,076
 మహబూబాబాద్    1,199            972
 కొత్తగూడెం        2,731            2,077
 ఖమ్మం            3,191            2,631
 నల్లగొండ            3,109            2,345
 సూర్యాపేట        1,551            1,273
 యాదాద్రి            1,245            884
 మహబూబ్‌నగర్        2,555            1,994
 నాగర్‌కర్నూల్        2,060            1,460
 వనపర్తి            1,702            1,361
 రంగారెడ్డి            2,354            1,764
 మల్కాజ్‌గిరి        499            361
 శంషాబాద్        662            463
 మెదక్            1,546            1,104
 సంగారెడ్డి            2,253            1,817
 సిద్దిపేట            1,560            1,178
 కామారెడ్డి            1,682            1,285
 నిజామాబాద్        2,828            2,207
 ----------------------------------
 మొత్తం            50,970        39,252
 ----------------------------------
 

మరిన్ని వార్తలు