సౌర విద్యుత్తుకు లేదు పౌర మద్దతు

16 May, 2015 23:20 IST|Sakshi
సౌర విద్యుత్తుకు లేదు పౌర మద్దతు

సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖకు ప్రధాన నగరాల నుంచి అందిన దరఖాస్తులు వేలల్లో...
 

తడిసి మోపెడవుతున్న విద్యుత్ బిల్లులతో విసిగి వేసారిపోతున్న హైదరాబాద్ వాసులకు తమ భవంతులపై సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ప్యానల్స్ అమర్చుకోవడం ద్వారా చౌక విద్యుత్‌ను వాడుకోవచ్చన్న ప్రచారం పెద్ద ఆసక్తినే రేపింది. అయితే, సోలార్ ప్యానల్స్‌కు అయ్యే ఖర్చు భారీగా ఉండటంతో ఔత్సాహికులు నీరుగారి పోయారు. ఈ పరికరాలు అందుబాటులోకి వచ్చి ఏళ్లు దాటింది. కేంద్రం మాత్రం రెండేళ్ల క్రితం దీనిని ఓ విధానంగా ప్రకటించి సబ్సిడీ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ రెండేళ్లలో హైదరాబాద్‌లో ఒక్కరు కూడా తమ భవంతిపై సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ముందుకు రాలేదు. సోలార్ ప్యానల్స్ అమర్చడానికి కనిష్టంగా రూ.3.25 లక్షలు, గరిష్టంగా 5.75 లక్షలు ఖర్చు అవుతుంది. దేశంలోనే ఐదో అతి పెద్ద నగరమైన హైదరాబాద్‌లో సంపన్నులకు కొదవ లేదు. ఇటీవలే నిర్వహించిన ఓ సర్వే ప్రకారం పెద్ద నగరాల్లో నివసిస్తున్న సంపన్నుల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. అలాంటిది సంపన్నులే ముందుకు రాకపోవడంతో మధ్యతరగతి వారూ సోలార్ విద్యుత్‌కు ఆసక్తి చూపడం లేదు. ‘ఇది ఖరీదైన వ్యవహారమే. అందువల్లే కేంద్రం సబ్సిడీ ప్రకటించింది.  రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోతే ఈ విధానం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అంత తేలికైన వ్యవహారం కాద’ని సోలార్ విద్యుత్ పరికరాల తయారీలో పేరుగాంచిన సంస్థ ప్రతినిధి చెప్పారు.
 
ముందుకు రాని అపార్టుమెంట్లు..

హైదరాబాద్‌లో కొద్ది మంది ధనవంతులు, బహుళ అంతస్తుల అపార్టుమెంట్లు అసోసియేషన్ల ప్రతినిధులను కలిసి వారి భవంతులపై సోలార్ విద్యుత్ ప్యానళ్ల ఏర్పాటుపై ఓ సంస్థ ప్రతినిధులు చర్చించారు. ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా పరికరాల ఖరీదులో 15 శాతం తగ్గించేందుకు అంగీకరించారు. అయితే, ఏ ఒక్కరూ ముందుకు రాలేదనీ, ప్యానల్స్ అమర్చుకోవడం, విద్యుత్ తయారీ, వినియోగం, బదిలీ వంటి అంశాల్లో అనుమానాలు ఉండటమే దీనికి కారణమనీ ఆ సంస్థ ప్రతినిధి వివరించారు. కేంద్రం ఈ విధానాన్ని అమలు చేసినప్పుడు హైదరాబాద్ సహా ఉమ్మడి రాష్ట్రంలోని (విభజనకు ముందు) అన్ని పట్టణాల్లో భవంతులపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు కొంత ప్రయత్నం చేసినా ఆ తరువాత అది మరుగున పడింది. ఇప్పుడు సోలార్ ప్యానల్స్ తయారీ సంస్థలు రంగంలోకి దిగి కొద్ది మందిని ఒప్పించినా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఓ విధానాన్ని ప్రకటించకపోవడంతో నీరు గారుతోంది.
 
2022 నాటికి 40 వేల మెగావాట్లు

నగరాలు, పట్టణాల్లో భవంతులపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ పెద్ద ప్రణాళికనే రూపొందించింది. 2022 నాటికి భవంతులపై సోలార్ విద్యుత్ పరికరాలను అమర్చడం ద్వారా 40 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, ఇప్పటికీ ఆ శాఖకు దేశవ్యాప్తంగా వచ్చిన ప్రతిపాదనల మొత్తం 358 మెగావాట్లకు మాత్రమే. అందులో 42 మెగావాట్ల విద్యుత్‌కు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. వీటిలో అత్యధికం దేశ వాణిజ్య రాజధాని ముంబైకి చెందినవే. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నుంచి దరఖాస్తులు ఉన్నాయి. అయితే హైదరాబాద్ నుంచి ఒక్క ప్రతిపాదన కూడా రాలేదు. ‘ఆసక్తి ఉన్న వాళ్లు కొద్ది మంది వచ్చి అడిగితే వివరాలు ఇచ్చాము. ఎందుకో వారు మళ్లీ రాలేదు’ అని ఇంధన శాఖ అధికారి ఒకరు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా హైదరాబాద్‌లో 288 మంది తమ భవంతులపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్నారు. అవి పాక్షిక అవసరాలకు ఉద్దేశించినవి మాత్రమేనని ఆ అధికారి చెప్పారు.
 
 పెరుగుతున్న విద్యుత్ బిల్లులకు విరుగుడు ఇదే


నివాస, వాణిజ్య భవనాలపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుంటే ఏటేటా పెరుగుతున్న విద్యుత్ బిల్లులో సగమైనా తగ్గించుకునేందుకు వీలు కలుగుతుందని నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా వాణిజ్య సముదాయాలపై ఇది మంచి ఫలితాలను ఇస్తుందని చెపుతున్నారు. ఒక ప్రైవేట్ సర్వే వెల్లడించిన సమాచారం మేరకు  హైదరాబాద్‌లో రమారమి 48 వేల భవనాలు సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి. వీటిలో 85 శాతం మంది మధ్యతరగతి వర్గానికి చెందిన వారే. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడానికి కేంద్రం సబ్సిడీ ఇస్తుందన్న సంగతి వారిలో అత్యధికులకు తెలియదు. అయితే, కేంద్రం నేరుగా వచ్చే దరఖాస్తులను స్వీకరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు స్పాన్సర్ చేస్తేనే వాటిని పరిశీలనకు తీసుకుని సబ్సిడీ ఇస్తారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దీనిని పట్టించుకోని ఫలితంగా కేంద్ర సబ్సిడీ కోసం ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరైన ప్రచారం జరగని విషయం వాస్తవమని సంబంధిత అధికారి ఒకరు అంగీకరించారు.
 
 
పెద్ద పెద్ద నగరాలు, పట్టణాల్లో భవంతులపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ పెద్ద ప్రణాళికనే రూపొందించింది. 2022 నాటికి భవంతులపై సోలార్ విద్యుత్ పరికరాలను అమర్చడం ద్వారా 40 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
 
హైదరాబాద్ నగరంలో రమారమి 48 వేల భవనాలు సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి. వీటిలో 85 శాతం మంది మధ్యతరగతి వర్గానికి చెందిన వారే.
 
►భవంతులపై సోలార్ ప్యానల్స్ అమర్చడానికి కనిష్టంగా రూ.3.25 లక్షలు, గరిష్టంగా 5.75 లక్షలు ఖర్చు అవుతుంది.
►ఈ రెండేళ్లలో హైదరాబాద్‌లో ఒక్కరు కూడా తమ భవంతిపై సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ముందుకు రాలేదు.
►సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్న సంగతి అత్యధికులకు తెలియదు.
 
 

మరిన్ని వార్తలు