ఇంటికి చేరువలోనే  విద్యుత్‌ సేవలు 

13 Oct, 2023 04:50 IST|Sakshi

14 రకాల పనులు గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పూర్తి 

వినియోగదారులు మీ–సేవా  కేంద్రాలకు వెళ్లనవసరం లేదు 

ప్రజలకు అందుబాటులో 7,883 మంది ఎనర్జీ అసిస్టెంట్లు 

ప్రతి ఎనర్జీ అసిస్టెంట్‌ 1,500 విద్యుత్‌ కనెక్షన్లకు బాధ్యుడు 

ఇకపై మరింత త్వరగా విద్యుత్‌ సమస్యలు పరిష్కారం 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువలోకి విద్యుత్‌ సేవలను తీసుకువచ్చింది. గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లోనే విద్యుత్‌ సంబంధిత సేవలు దాదాపు అన్నింటిని అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లూ విద్యుత్‌ బిల్లుల చెల్లింపు మినహా మీ–సేవా కేంద్రాల్లో పొందిన సేవలు ఇకపై వినియోగదారుల ఇంటికి చేరువలోనే లభించే ఏర్పాటు చేసింది. ఇక గ్రామాల్లో కరెంటు బిల్లు­లు కట్టడానికి సచివాలయాలకు వెళితే సరిపోతుంది. తాజాగా అమల్లోకి వచ్చిన ఈ సేవలతో రాష్ట్రంలోని దాదాపు 1.92 కోట్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.    

ఎనర్జీ అసిస్టెంట్లకు బాధ్యతలు 
పట్టణాలు, గ్రామాల్లో ప్రజలకు అంతరాయాలు లేకుండా విద్యుత్‌ అందించడంలో ఎనర్జీ అసిస్టెంట్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. సచివాలయ వ్యవస్థలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,883 మంది ఎనర్జీ అసిస్టెంట్లను విద్యుత్‌ శాఖ ద్వారా నియమించారు. వీరికి అవసరమైన శిక్షణను ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు అందించాయి. భవిష్యత్‌లో వీరికి లైన్‌మెన్, సీనియర్‌ లైన్‌మెన్, లైన్‌ ఇన్‌స్పెక్టర్, లైన్‌ సూపర్‌వైజర్, ఫోర్‌మెన్‌గా పదోన్నతులు పొందేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది.

ప్రతి ఎనర్జీ అసిస్టెంట్‌ను గరిష్టంగా 1,500 విద్యుత్‌ కనెక్షన్లకు బాధ్యుడిని చేశారు. కనీసం 30 నుంచి 40 ట్రాన్స్‌ఫార్మర్లను ఇతను నిరంతరం పర్యవేక్షిస్తాడు. 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో లైన్‌పై చెట్లు పడినా, జంపర్లు తెగిపోయినా బాగు చేయడం, ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయినా, చెడిపోయినా, మీటర్లు ఆగిపోయినా కొత్తవి బిగించడం వంటి విధులతో పాటు మరే ఇతర విద్యుత్‌ సమస్యలు తలెత్తినా బాగు చేస్తారు.

వారి స్థాయి కానప్పుడు పైఅధికారులకు వెంటనే సమాచారం అందించడం ద్వారా సాంకేతిక నిపుణులు త్వరగా వచ్చేలా చూస్తారు. విద్యుత్‌ సరఫరాకు సంబంధించి వలంటీర్ల ద్వారాగానీ ప్రజలు నేరుగాగానీ గ్రామ సచివాలయానికి ఫిర్యాదు చేసేŠత్‌ క్షణాల్లో సమస్యలను పరిష్కరిస్తారు. ఇకపై వీరు విద్యుత్‌ రంగానికి సంబంధించిన అన్ని సేవలను సచివాలయాల ద్వారా ప్రజలకు అందేలా చూస్తారు. 

గ్రామ, వార్డు సచివాలయాల్లో విద్యుత్‌ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన సేవలు 
1. గృహ, వాణిజ్య సర్విసు కనెక్షన్ల  కోసం దరఖాస్తు  
2. వ్యవసాయ సర్విసు కనెక్షన్ల కోసం దరఖాస్తు 
3. అదనపు లోడ్‌ దరఖాస్తు 
4. కేటగిరి మార్పు 
5. సర్వీసు కనెక్షన్‌ పేరు మార్పు  
6. మీటరు టెస్టింగ్‌కు సంబంధించి 
7. మీటరు కాలిపోవటంపై ఫిర్యాదు  
8. బిల్లులకు సంబంధించిన సమస్యలు 
9.ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన  ఫిర్యాదులు 
10. వోల్టేజ్‌ హెచ్చుతగ్గులపై ఫిర్యాదులు 
11. లైన్‌ షిఫ్టింగ్‌ 
12. పోల్‌ షిఫ్టింగ్‌ 
13. మీటరు ఆగిపోవడం, నెమ్మదిగా తిరగడంపై ఫిర్యాదులు 
14. విద్యుత్‌ బిల్లులు చెల్లింపు 

ప్రజలకు మరింత సౌకర్యంగా..  
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విద్యుత్‌ సేవలు పొందేందుకు ప్రజలకు అవకాశం కల్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన సూచనలతో విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిస్కంలను కొన్ని నెలల క్రితం జరిగిన సమీక్షలో ఆదేశించారు. ఆ మేరకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చేసి తాజాగా అన్ని సేవలను సచివాలయాల్లోనే అందుబాటులోకి తీసుకువచ్చాం.

డిజిటలైజేషన్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ పేమెంట్‌ యాప్స్‌(యూపీఐ)ల ద్వారా, డిస్కంల సొంత యాప్స్‌ ద్వారా చాలా మంది విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నారు. కొందరు అందుబాటులో ఉన్న నగరాలు, పట్టణాల్లో ఎనీటైమ్‌ పేమెంట్‌ (ఏటీపీ)మెషిన్స్, విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయాల్లో బిల్లులు కడుతున్నారు. గ్రామాల్లో నెలకోసారి దండోరా వేయించి సంస్థ ప్రతినిధి వెళ్లి బిల్లులు కట్టించుకుంటున్నారు. ఇకపై సచివాలయాల్లో కూడా కరెంటు బిల్లులు చెల్లించే సౌకర్యాన్ని కల్పించాం. –ఐ.పృధ్వితేజ్, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్‌. 

మరిన్ని వార్తలు