ఒంటరిగా వచ్చిందని హోటల్‌ రూం ఇవ్వలేదు!

26 Jun, 2017 11:38 IST|Sakshi
ఒంటరిగా వచ్చిందని హోటల్‌ రూం ఇవ్వలేదు!
  • హైదరాబాద్‌లో ఎన్నారై మహిళకు చేదు అనుభవం
  • హైదరాబాద్‌: నగరాన్ని సందర్శించేందుకు వచ్చిన ఓ ఎన్నారై మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఒంటరిగా వచ్చిందన్న కారణంతో ఆమెకు గది ఇచ్చేందుకు నిరాకరించింది ఓ హోటల్‌. తనకు ఎదురైన ఈ దుస్థితిపై ఆమె ఫేస్‌బుక్‌లో వెల్లడించడంతో.. ఆమె పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. నగరంలోని హోటళ్లు అనుసరిస్తున్న పాలసీపై చర్చ నడుస్తోంది.

    నుపుర్‌ సారస్వత్‌ అనే మహిళ ట్రావెల్‌ వెబ్‌సైట్‌ ‘గోఐబిబో’ ద్వారా ఎర్రగడ్డలోని హోటల్‌ దక్కన్‌లో గది బుక్‌ చేసుకున్నారు. శనివారం నగరానికి వచ్చిన ఆమె హోటల్‌కు వెళ్లగా..  ’సింగల్‌ లేడీ’ ( ఒంటరి మహిళ) అన్న కారణంతో హోటల్‌ ఆమెకు గది నిరాకరించింది. ఈ విషయాన్ని ఆమె ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. ‘ప్రస్తుతం నేను హైదరాబాద్‌లో ఓ హోటల్‌ బయట నిలుచున్నాను. ఆన్‌లైన్‌ బుకింగ్‌ను అంగీకరించినప్పటికీ.. నేను ‘ఒంటరి మహిళ’ అన్న కారణంతో నాకు హోటల్‌లో గది ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు. ఈ పోస్టు వెంటనే వైరల్‌గా మారింది. దీంతో ట్రావెల్‌ వెబ్‌సైట్‌ నగరంలోని మరో హోటల్‌లో కాంప్లిమెంటరీ గదిని ఆమెకు సమకూర్చింది. అంతేకాకుండా తనకు ట్రావెల్‌ వెబ్‌సైట్‌ క్షమాపణలు చెప్పిందని, ఇలాంటి నిబంధనలు పాటించే హోటళ్లను తమ వెబ్‌సైట్‌ నుంచి తొలగిస్తున్నట్టు చెప్పిందని ఆమె మరో పోస్టులో వెల్లడించారు.
     

మరిన్ని వార్తలు