లక్షన్నర మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాల సేకరణ

28 Dec, 2015 02:08 IST|Sakshi
లక్షన్నర మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాల సేకరణ

♦ ఎఫ్‌సీఐ ద్వారా తెలంగాణలో 25 వేల మెట్రిక్ టన్నుల కందుల కొనుగోలు
♦ ధరల స్థిరీకరణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది
♦ ‘సాక్షి’తో కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్
 
 సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కంది పప్పు ధరలను నియంత్రణలో ఉంచేందుకు వీలుగా భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) ద్వారా కందుల సేకరణ చేస్తున్నట్లు కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ తెలిపారు. దేశం మొత్తంగా ధరల నియంత్రణకు వీలుగా 1.50 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలను సేకరించి అదనపు నిల్వలు(బఫర్ స్టాక్) సిద్ధం చేసుకోవాలని నిర్ణయించామని చెప్పారు. తెలంగాణలో 25 వేల మెట్రిక్ టన్నుల కంది సేకరణ లక్ష్యంగా నిర్ణయించామన్నారు. నేరుగా రైతుల నుంచి మార్కెట్ ధర కు కందులు సేకరిస్తామని, దీనికి మార్క్‌ఫెడ్, నాఫెడ్ సేవలను వినియోగిస్తామన్నారు.

ధరల నియంత్రణ అవసరమైనప్పుడు పప్పుగా మార్చిన కందిని బహిరంగ మార్కెట్‌లోకి  ఎఫ్‌సీఐవిడుదల చేస్తుందని వివరించారు. రాష్ట్రా ల అవసరాలు తీరాక మిగులుంటే, ఆయా రాష్ట్రాల అంగీకారం మేరకు ఇతర రాష్ట్రాల అవసరాలకు మార్కెట్‌లోకి విడుదల చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం హైదరాబాద్ వచ్చిన పాశ్వాన్ పార్క్ హయత్ హోటల్‌లో ఎఫ్‌సీఐ అధికారులతో భేటీ అయ్యారు. వారితో వివిధ అంశాలపై సమీక్షించిన అనంతరం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

 నిల్వలపై ఆంక్షలు: ఈ ఏడాది వర్షపాత లేమి వల్ల దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షల ఎకరాల్లో పప్పు దినుసుల సాగు తగ్గి, దిగుబడి పడిపోయిందని.. అందువల్లే ధరలు పెరిగాయని పాశ్వాన్ తెలిపారు. కంది నిల్వలపై విధించిన నియంత్రణను ఏడాది పాటు పొడిగించామని, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు ఈ నియంత్రణ పెట్టామన్నారు. గతంలో  ఉల్లి ధరలు పెరిగినప్పుడు కేంద్రం సత్వరమే స్పందించి చర్యలు తీసుకుందని తెలిపారు. ఉల్లి దిగుమతులపై గతంలో ఉన్న ఆంక్షలు ఎత్తివేశామని, దేశంలో ఏ రాష్ట్రం నుంచైనా దిగుమతి చేసుకునే వెసులుబాటు కల్పించిన కేంద్రం, ఇతర దేశాల నుంచి సైతం దిగుమతి చేసుకునేలా ప్రస్తుత నిబంధనలను సవరించామన్నారు.
 
 తెలంగాణలో 21 లక్షల బోగస్ కార్డుల తొలగింపు
 దేశంలో తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాల్లో ఆహార భద్రతా చట్టం అమల్లోకి వచ్చిందని పాశ్వాన్ తెలిపారు. తెలంగాణలో 1.91 కోట్ల మంది ఈ పథకం కింద ఉన్నారన్నారు. తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో 100 శాతం కార్డుల కంప్యూటరైజేషన్ పూర్తయిందన్నారు. తెలంగాణలో కార్డులను ఆధార్‌తో సీడింగ్ చేసి 21 లక్షల బోగస్ కార్డులను తొలగించారని, దీంతో నిజమైన అర్హులకు లబ్ధి చేకూరుతుందన్నారు. సాంకేతికత వినియోగంలో తెలంగాణ ముందుందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా సరఫరా చేస్తున్న సరుకుల పంపిణీ అక్రమాలు, దారి మళ్లింపులకు అడ్డుకట్ట వేసేందుకు తెచ్చిన పంపిణీ వ్యవస్థ నిర్వహణ (సప్లై చైన్ మేనేజ్‌మెంట్)ను తెలంగాణలో అమలు చేస్తే మరిన్ని అక్రమాలను అడ్డుకోవచ్చని, ఇప్పటికే ఈ విధానం 8 రాష్ట్రాల్లో అమలై మెరుగైన ఫలితాలు ఇస్తోందని చెప్పారు.
 
 ఆహార ధాన్యాలకు నగదు బదిలీ..
 ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాయితీపై అందజేస్తున్న సరుకుల పంపిణీలో అక్రమాలు, లీకేజీల నివారణకు నేరుగా నగదు బదిలీ చేయాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. ప్రస్తుతం చండీగఢ్, పుదుచ్చేరిల్లో దీనిని అమలు చేస్తోందని, మరిన్ని రాష్ట్రాల్లో ఈ విధానం అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. లబ్ధిదారుల వివరాల డిజిటలైజేషన్, ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తయితే దీన్ని నిర్వహించడం సులభమవుతుందని, దీని ద్వారా రాయితీ సొమ్ము నేరుగా లబ్ధిదారుడికే చేరి ఎక్కడైనా సరుకులు కొనే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. కిరోసిన్ విషయంలో నగదు బదిలీ చేయాలన్న అంశాన్ని పెట్రోలియం శాఖ పరిశీలిస్తోందని, మున్ముందు దీనిపై నిర్ణయం రావచ్చన్నారు.

మరిన్ని వార్తలు